కర్మ యోగి మల్లిఖార్జున రావు -1

స్ఫూర్తి ప్రధాత - 1

ఈ విశాల లోకంలోకి అనేక మంది వ్యక్తులు వస్తారు అలాగే నిష్కక్రమిస్తారు, వారిలో తన కొరకు తన కుటుంబ హితం కొరకు జీవించివారు కొందరైతే  మరి కొందరు మాత్రమే కుటుంబ హితంతో పాటు సమాజహితం  కొరకు పరి తపించేవారు ఉంటారు. అలాంటి ఉన్నత భావజాలం పుష్కలంగా ఉన్న కర్మయోగి కొడాలి మల్లిఖార్జున రావు.  జనజీవన స్రవంతిలో  మనుగడ సాగించే మందలో ఒకరిలా కాక వందనాలు అందుకునే వందమంది వదాన్యులలో  ఒకరిలా జీవించిన ఆదర్శ మూర్తి , త్యాగ ధనుడు, నిష్కామ యోగి . 
మల్లిఖారున రావు -1950
గుంటూరు జిల్లా తెనాలికి దగ్గరలో అమృతలూరు మండలం, మోపర్రు గ్రామంలో  కొడాలి వెంకట్రామయ్య, లక్ష్మీ నరసమ్మ దంపతులకు రెండవ సంతానంగా మల్లిఖార్జునరావు గారు 1930 లో జన్మించారు. మధ్య తరగతి వ్యవసాయ కుటుంభంలో జన్మించిన మల్లిఖార్జునకు అన్న గోపాల కృష్ణ, చెల్లి ధనమ్మ, తమ్ముడు Dr.రంగారావు తోడబుట్టిన వారు. 
మల్లిఖార్జుని బాల్యం మోపర్రు తో పాటు అమ్మమ్మ గారి ఊరు పెదరావూరులో గడిచింది. తన అమ్మమ్మ (పాలడుగు వెంకటకృష్ణయ్య,వరలక్ష్మమ్మ) మరియు  చిన్నమ్మ(కొడాలిసుబ్బారావు, చిట్టెమ్మ) గారి దగ్గర ఉండేవారు. 
మల్లిఖార్జునకు బాల్యం లోనే దైవ చింతన అలవడినది. చురుకైన విద్యార్థి.  కోపం జాలి సమపాళ్లలో ఉండి ముక్కుసూటిగా నడుచుకునే వ్యక్తిత్వం. తురుమెళ్ళ ఉన్నత పాఠశాలలో SSLC పూర్తి అయిన తరువాత అక్కడే కొంతకాలం వ్యాయామ విద్య సహాయకులుగా  పని చేసి ఆ ఉద్యోగంలో సంతృప్తి లేక దాన్ని వదిలి ఆధ్యాత్మక చింతనతో ఆశ్రమాల చుట్టూ తిరిగారు. అహింస తన ప్రవృత్తిగా, జీవ కారుణ్యం తన మార్గంగా స్వీకరించి కడదాకా శుద్ధ శాఖాహారిగా జీవించాడు. 
గాంధీజీ నడయాడిన ఇల్లు 

స్వతంత్ర కాంక్షతో అభ్యుదయ భావాలు అలవర్చుకున్న విద్యావంతుల గ్రామం మోపర్రు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు గాంధేయవాది కల్లూరి చంద్రమౌళి గారు, వారి అడుగుజాడలలో నడిచిన  కొడాలి కమలమ్మ, కల్లూరి తులశమ్మ  గుత్తికొండ రామబ్రహం వంటి  స్వాతంత్ర సమర యోధులు,   సుందరాకాండను  స్వరపరిచిన గాయకుడు  యం. యస్. రామారావు, కవి చారిత్రిక పరిశోధకుడు కొడాలి లక్ష్మీనారాయణ వంటి ఎందరో  ప్రముఖులు  ఈ గ్రామం వారే.

కల్లూరి చంద్రమౌళి గారి నాయకత్వంలో సాగిన ఉద్యమంలో 1928 డిసెంబర్ లో మహాత్మాగాంధీ గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా ఒక రోజు మోపర్రులోఉన్నారు.  ఆనాటికి గ్రామంలో అన్ని వసతులు  ఉన్న ఏకైక డాబా ఇల్లు మల్లిఖార్జున రావు తాత కొడాలి వెంకటప్పయ్య గారిదే. వీరి ఇంటి లోనే  గాంధీజీ రాత్రి విడిదికి ఏర్పాట్లు చేసారు.
మోపర్రులో ఈ కుటుంబానికి డాబా అనేది ఒక విశేషణంగా వచ్చింది. మల్లిఖార్జున తండ్రి  పెద్ద వేంకట్రామయ్య కాస్తా డాబా వేంకట్రామయ్యగా ప్రచారం పొందాడు. 
మహాత్మా గాంధీజీని అభిమానించే మల్లిఖార్జున రావుకి  నెహ్రు నాయకత్వంలో కాంగ్రేస్ పార్టీ అంటే తీవ్రమైన వెతిరేకత ఉండేది. ఆచార్య రంగా, చరణ్ సింగ్ ల  అభిమానిగా రైతాంగ ఉద్యమాలకు అండగా నిలిచేవారు. ఆతరువాత N T రామారావు ను అభిమానించారు. 



గాంధీజీ మరణాతరం కృపలాని ఆధ్వర్యంలో గాంధీ స్మారక నిధికి 1950లో మల్లిఖార్జునరావు రెండు రూపాయలు విరాళం ఇచ్చిన రసీదు .



Fund-raising receipt for the Gandhi Smarak Nidhi signed by Acharya Jb Kriplani in 1949.
అభ్యుదయవాది 
బాల్యంలోనే స్వతంత్ర సమరయోధులను, అభ్యుదవాదులను స్ఫూర్తిగా తీసుకొన్న  మల్లిఖార్జునగారి   వ్యక్తిత్వంలో  కొద్దీ మేర త్రిపురనేని రామస్వామి చౌదరి గారి అభ్యుదయ హేతు భావాలతో పాటు నిరీశ్వరవాద ఆధ్యాత్మక చింతనలు కూడా చోటు చేసుకున్నాయి. యోగులన్నా, అవధూతలన్న అంతులేని అభిమానం, భక్తి, విశ్వాసం. వీరి సాంగీత్యంలో క్రమంగా వేదాంతంపై ఆశక్తి ఆశ్రమ జీవితం పై అనురక్తి పెంచుకున్నాడు. 
ఇది ఇంటి లోనివారికి కొంత ఆందోళన కల్గించింది. వివాహంతో వైరాగ్యం వదిలి సంసార జీవితంలోకి వస్తాడని మల్లిఖార్జునకు పెళ్లి సంబంధాలను వెదకటం మొదలు పెట్టారు. ఎంతో ప్రయాసపడి ఆధ్యాత్మక మార్గంలో పయనిస్తున్న అతని తలుపులను దారి మళ్లించటానికి అతని కోరిక ప్రకారమే ఇంటిలో పెళ్లి కి అంగీకరించారు.  
ఒకనాటి గుంటూరుజిల్లా ప్రస్తుతం ప్రకాశం జిల్లా పరుచూరు మండలం వీరన్నపాలెం గ్రామపెద్ద, మనుసుబు గారైన గోరంట్ల వీర రాఘవయ్య, పిచ్చమ్మ గార్ల ఏకైక పుత్రిక లక్ష్మీదేవమ్మను మల్లిఖార్జునరావు  1950లో వివాహమాడారు. 
మల్లిఖార్జునరావు లక్ష్మి దేవమ్మ-1996

వీర రాఘవయ్య గారికి చిన్న వేంకటేశ్వర్లు చౌదరి, రామయ్య చౌదరి, వేంకట సుబ్బయ్య, బుచ్చియ్య చౌదరి అనే నలుగురు కొడుకులు తరువాత లక్ష్మీదేవమ్మ 1932 లో జన్మించినది.   అమ్మా నాన్నల గారాల ముద్దుల బిడ్డ, నలుగురు అన్నల అనురాగ  సోదరి అయిన లక్ష్మీదేవమ్మ తెలుగు, హిందీ భాషలలో విద్యనభ్యసించారు. 
లక్ష్మి దేవమ్మ పెద్ద సోదరుడు Dr. CVG చౌదరి గారు పశు  వైద్యం లో లండన్ లో ఉన్నతవిద్యను అభ్యసించాడు. వారు  ఉత్తర ప్రదేశ్ లోని మధుర పశు వైద్యశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నప్పుడు లక్ష్మీదేవమ్మ కొంతకాలం అక్కడ ఉన్నందువల్ల హిందీలో అనర్గళంగా మాట్లాడగలరు.  ఏ భాష అయినా మాట్లాడటంవల్ల అది నిలుస్తుందన్న సత్యాన్ని గ్రహించిన లక్ష్మీదేవి గారు కడవరకు దాన్ని పాటించారు. తన అవసాన దశలో పలకరించటానికి వచ్చిన లాల్ వజీర్ ( టి.డి. పి. నాయకులు ) అనే ముస్లింతో ప్రేమగా హిందీలో సంభాషించటం ఆమె నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం. వాడుకలో లేకపోతే పనిముట్టు అయినా భాషైనా క్షిణిస్తాయన్నది నిరూపిత నిజాన్ని ఈ నాటి ప్రవాసులు తెలుసుకోవాలి. ఈ నాడు విదేశీ వ్యామోహంలో తమ పిల్లలకు మాతృ భాషను నేర్పక బతుకుతెరువు భాషను నేర్పి పేగుబంధాలు తెగతెంపులు చేస్తున్నారు.  ఇలాంటి బ్రతుకు తెరువు బాపతు జీవులు తమ మాతృ భాష తెలుగు వారిలో కలకాలం జీవించి ఉండాలంటే సాధ్యమైనతవరకు తెలుగులోనే మాట్లాడాలి. 
కీ. శే. గోరంట్ల పిచ్చమ్మ గారి పార్థివ దేహంతో (1959)
రామయ్య చౌదరి, బుచ్చియ్య చౌదరి,వేంకట సుబ్బయ్య, లక్ష్మీదేవమ్మ 

లక్ష్మీదేవమ్మ రావు  ల ముద్దు బిడ్డలు 
లతా మంజరి, రమేష్ బాబు,  శ్రీనివాస్ (1967)

లక్ష్మీదేవమ్మతో వివాహం అయిన పిదప అత్త పిచ్చమ్మ గారి కోరికపై తన బావమరుదుల సలహాలతో  మల్లిఖార్జున రావు  వీరన్నపాలెంలో కాపురం పెట్టి అక్కడే 1956 లో ఒక ఇల్లు కొని స్థిరపడిపోయారు. ఆనాడున్న ఆధునిక సాంకేతకను ఉపయోగించి సన్ షేడ్, ఫ్లోరింగ్ వంటివాటితో ఇంటిని తీర్చిదిద్దారు.  వీరికి రమేష్ బాబు(1956), లతామంజిరి(1959), శ్రీనివాస్(1961) అనే ముచ్చటైన ముగ్గురు సంతానం జన్మించారు. 
స్వచ్ఛ గ్రామ కార్యకర్త
విద్య, వైద్యం అనేవి సమాజ ప్రగతికి పట్టుకొమ్మలని ప్రగాఢంగా నమ్మి, దానిని ఆచరించిన వ్యక్తి మల్లిఖార్జున రావు. విద్య, వైద్య పరంగా వీరన్నపాలెం బాగా వెనుకపడిందని ముందుగా గుర్తించిన వ్యక్తి.  రహదారుల ప్రక్క స్త్రీ ,పురుష బేధం లేకుండా ఊరు అంతా బహిరంగ మల విసర్జన చేస్తున్న సమయంలో అది తప్పు అని అనారోగ్య హేతువని ప్రచారం చేశారు. మరుగు దొడ్డి లేకపోతే పెరట్లో/చావిడిలోనో  చిన్న గొయ్యి తీసుకొని దానిలో మలవిసర్జన తరువాత మట్టితో కప్పాలని చెప్పటమే కాక తాను ఆచరించి చూపిన తొలి స్వచ్ఛ గ్రామ కార్యకర్త. NSS/ NCC/ స్కౌట్ దళాల శిక్షణా కాలంలో ఆచరించే పద్ధతి ఇదే. ఎంతమంది అజ్ఞానులు ఎన్నివిధాలుగా వెగతాళి చేసినా లెక్కచేయని ధీరోదాత్తుడు. ఆత్మ గౌరవం , ఆరోగ్యం  మరుగుదొడ్డి వల్ల లభిస్తుందనుటలో ఇసుమంతైనా సందేహం లేదని నమ్మిన వ్యక్తి.  
వీరన్నపాలెం గ్రామంలో  తొలి మరుగు దొడ్డిని (ఇటుకలతో సెప్టిక్ ట్యాంకు కట్టి) తక్కువ స్థలంలో తన ఇంటిలో నిర్మించి ఎందరికో మార్గదర్శిగా వ్యవహారించారు. తన స్వగ్రామం మోపర్రు నుండి బండ్లపై మట్టి వరలు తెప్పించి తక్కువ ఖర్చుతో మరుగు దొడ్డిని చిన్న స్థలంలో కూడా నిర్మించుకోవచ్చని నిరూపించిన నిర్మలమైన మనస్సు ఉన్న వ్యక్తి. ఇంటిలో మరుగుదొడ్డి ఏమిటని వెగతాళిగా నవ్వినవారే సిగ్గుపడి తరువాత రోజులలో వీరి సలహాలతో ఫాయిఖానాలు కట్టుకున్నారు. 
ఇప్పటికి ఇంకా అనేక గ్రామాలలో కొంతమంది సిగ్గు లేకుండా బహిరంగ మలవిసర్జన చేస్తున్నారంటే వారిని ఏమనాలి?  పేదరికం మాటున దాగిఉన్న అజ్ఞానం అందామా లేదా అనాదిగా జీర్ణించుకుపోయిన అలవాటని సరిపుచ్చుకోవాలా?  ఇలాంటి అనాగిరిక అలవాటుతో అనారోగ్యం కొనితెచ్చుకొనే అజ్ఞానులను నయానో భయానో కట్టడి చేయాలి. విధ్యుత్ ఉపకరణాలు, టి.వి, సెల్ల్ ఫోన్ వంటి అనేక ఆధునిక సౌకర్యాలు వాడే ఈ బాపతు వ్యక్తులు అందరి ఆరోగ్యం కొరకు  మరుగు దొడ్డిని కూడా వాడటం నేర్చుకుంటే స్వచ్ఛ గ్రామం సాకారం అవుతుంది.  తద్వారా గాంధీజీ కలగన్న స్వచ్ఛ భారత్ త్వరలో అవతరిస్తుంది. 1955 లోనే బహిరంగ మల విసర్జనను నిరసించిన మల్లిఖార్జున రావు గారి ఆశయం (free from open defecation) త్వరలోనే సిద్ధిస్తుందని, వీరన్నపాలెం స్వచ్ఛ గ్రామంగా మారుతుందని  ఆశిద్దాం.  
(మిగిలిన విషయాలు రెండొవ భాగంలో )

Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

మానవతావాది డాక్టర్ కొడాలి రంగారావు

కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి