KOMALA CHARITABLE TRUST

జన హితం - మన మతం
జన హితం అంటే సమాజానికి మంచి కలిగించేదిగా మన సిద్దాంతం (మతం) ఉండాలనే స్పుర్తికరమైన నినాదంతో ఆరోగ్యకరమైన వివేకవంతమైన విజ్ఞాన సమాజాన్ని మానవీయ విలువలతో రూపొందించటంలో తన వంతు కృషి చేయటానికి కొమల చారిటబుల్ ట్రస్ట్ ప్రారంబించ బడినది. నిబద్దతతో నిస్వార్దంగా నిర్వహించే ఈ బృహత్తర సమాజసేవా కార్యక్రంలో మీ అందరి సహాయ సహకారాలు అందించ గలరని అర్దిస్తున్నాం

Sunday, 2 July 2017

S. V. M. M. ఓపెన్ షెల్టర్ లో సేవా కార్యక్రమం

కొమల చారిటబుల్ ట్రస్ట్ మరియు కళ్ళం హరనాథ రెడ్డ్ సాంకేతిక కళాశాల ( KHIT )  సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపక బృందం సంయుక్తంగా 2-07-2017 ఆదివారం సాయంత్రం  S. V. M. M.  ఓపెన్ షెల్టర్ ,పట్టాభిపురం  గుంటూరు లో ఉన్న అనాధ బాల బాలికల ఆశ్రమాన్ని సందర్శించారు. ఆశ్రమంలో ఉన్న పిల్లల సంరక్షణ , యోగక్షమాచారాలు, విద్యావిషయాలు విచారించి వారి ఆటపాటలు చూసారు. ఆ తరువాత వారికి  "దుప్పట్లు" వితరణ చేశారు. పిల్లందరికి  భోజనం ఏర్పాటు చేసి వారితో కలసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో కొమల ట్రస్ట్ అధ్యక్షులు ప్రొఫెసర్  కొడాలి శ్రీనివాస్, కార్యదర్శి శ్రీమతి  కొడాలి రాఘిణి, ట్రస్టీ శ్రీమతి సుధీర లోకేష్ లతో పాటు   KHIT సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపక బృందం నుండి డాక్టర్ C.రమేష్ కుమార్ రెడ్డి, N.V. మోహన్ కృష్ణ , V. రాజేంద్ర కుమార్, K.శివ కిరణ్, M.ఈశ్వర్ రెడ్డి, P.మహేష్ రెడ్డి, తేజ కిరణ్ కుమార్ లు పాల్గొన్నారు. N.V. మోహన్ కృష్ణ,  V. రాజేంద్ర లు  ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. 
సమాజంలో నానాటికి మానవత్వం తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ, మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ దాదాపు 80 మంది అనాధ పిల్లలను చేరదీసి వారికి మంచి వసతి కల్పించి విద్యా బుద్దులు నేర్పుతున్న S. V. M. M.  ఓపెన్ షెల్టర్  నిర్వాహకులను ప్రొఫెసర్  కొడాలి శ్రీనివాస్ గారు అభినందించారు.  ఈ అనాధ బాలబాలికలకు భవిషత్తులో తాము అండగా ఉంటామని, ప్రతి మాసం లోను సహాయసహకారాలు అందిస్తామని తెలిపారు.  

S. V. M. M.  ఓపెన్ షెల్టర్ విద్యార్థులతో ముచ్చటిస్తున్న ప్రొఫెసర్  కొడాలి శ్రీనివాస్
S. V. M. M.  ఓపెన్ షల్టర్ లో బాలికలకు  దుప్పట్లు వితరణ చేస్తున్న శ్రీమతి కొడాలి రాఘిణి 


దుప్పట్లు వితరణ చేస్తున్నకొమల ట్రస్ట్ అధ్యక్షులు ప్రొఫెసర్  కొడాలి శ్రీనివాస్

కొమల ట్రస్టీ శ్రీమతి సుధీర లోకేష్  చేతులమీదుగా దుప్పటి అందుకుంటున్న చిన్నారి 

 ఆట పాటలతో  ఆనందంగా ఉన్న ఆశ్రమ విద్యార్థులు


పిల్లలకు భోజనం వడ్డిస్తున్న నిర్వాహకులు 


Thursday, 23 February 2017

జీవితం చేజారనీయకు


ఆపిల్ కంపెనీ సృష్టికర్త,ప్రపంచ మేధావుల్లో ఒకరైన స్టీవ్ జాబ్స్ ఆసుపత్రిలో , తన ఆఖరి రోజుల్లో డైరీలో రాసుకున్న మాటలు

 వ్యాపార జగత్తులో శిఖరాన్ని చేరాను నేను. విజయానికి ప్రతీకగా నిలిచాను.
పని తప్ప నాకు వేరే ఆనందం తెలీదు.
సంపాదనకే అంకితమైపోయాను.
ఇప్పుడు ఈ మరణశయ్య మీద రోజులు లెక్కపెట్టుకుంటున్న
నేను ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే, ఇన్నాళ్ళూ నేను గర్వపడిన పేరూ డబ్బూ ఎందుకూ కొరగానివని నాకు అనిపిస్తోంది .

ఈ నిశిరాత్రిలో ...
నా ప్రాణాలు నిలిపేందుకు అమర్చిన యంత్రాలు చేసే శబ్దంలో నాకు మృత్యుదేవత ఊపిరి చప్పుడు వినిపిస్తోంది.

నాకిప్పుడనిపిస్తోంది...

జీవితంలో సరిపడా డబ్బు సంపాదించాక,

మనం ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయి.
కళలూ , అనుబంధాలూ , చిన్నపాటి కలలూ , కోరికలూ , సేవ ..........
ఇలా డబ్బుకి అవతల చాలా ప్రపంచం ఉంది .
కానీ డబ్బు వెనుక పెట్టే పరుగు మనిషిని మరమనిషిలా మార్చేస్తుంది .
అందుకు నేనే ఉదాహరణ .

ఇతరుల మనసుల్లోని ప్రేమను గుర్తించాలనే దేవుడు మనకు జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. కానీ డబ్బుకు మాత్రమే విలువనిచ్చే కాల్పనిక జగత్తును మనం సృష్టించుకున్నాం.

నేను సంపాదించిన డబ్బు ఈ క్షణం నాకు తోడుగా లేదు .
నా ఈ ఆఖరి ప్రయాణంలో అది నా వెంట రాదు .
నేను నాతో తీసుకువెళ్ళగలిగేది ప్రేమానుభూతులూ, అందమైన జ్ఞాపకాలు మాత్రమే .
ఈ ప్రేమపూర్వక అనుభూతులే ఎప్పుడూ మనతో ఉంటాయి.
మనల్ని ఉన్నతస్థాయికి చేరుస్తాయి .

నిజం , అంతా మన హృదయంలోనే , మన చేతుల్లోనే ఉంది .
ఈ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మంచం ఏదో తెలుసా?........
నువ్వు రోగంతో బాధపడుతూ పడుకున్న మంచం.
నీ కారు నడపడానికి ఒక డ్రైవర్ ను నియమించుకోగలవు .
నీ కోసం సంపాదించిపెట్టగలిగే ఉద్యోగులను నియమించుకోగలవు.
కానీ , నీ జబ్బునూ , నీ బాధనూ అనుభవించే వ్యక్తిని మాత్రం
ఎన్ని కోట్లు పెట్టినా నువ్వు ఏర్పాటు చేసుకోలేవు .
నువ్వు దేన్ని కోల్పోయినా తిరిగి పొందవచ్చుగానీ
చేజారిన జీవితాన్ని మాత్రం తిరిగి పొందలేవు .

జీవితంలో ఈరోజు మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా –
కథ ముగిసే రోజు , తెరపడే రోజు ఒకటి వస్తుంది .
అప్పుడు – ఎంత ఆరాటపడినా కాలం వెనక్కి వెళ్ళదు .

అందుకే ..., కాస్త ముందే కళ్ళు తెరువు .
డబ్బును కాదు , నీ కుటుంబాన్ని ప్రేమించు .
నీ స్నేహితులను ప్రేమించు . నీ చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రేమించు
ఆనందంగా జీవించు.

Source: internet హిత వచనాలు 

Wednesday, 21 December 2016

స్ఫూర్తి ప్రధాత - 4

మూడోవ  భాగం తరువాయి


ఆధ్యాత్మక చింతన

శ్రీ చిన్నమ్మ 
ఆధ్యాత్మక భావనలు మెండుగా గల మల్లిఖార్జునరావుకు కాకతాళీయంగా రేపల్లె అవధూత శ్రీ చిన్నమ్మను దర్శించాక వారి చింతనలో కొంత స్పష్టత చేకూరింది.

 "చెట్టు బొమ్మ నుండి విత్తనాలు, ఆవు బొమ్మనుండి పాలు, దేవుని బొమ్మల నుండి మోక్షాన్ని సాదించలేరు. ఆవు బొమ్మ మనం వేసిన ఆహారాన్ని తినజాలదు. పోసిన నీరు త్రాగలేదు. మనకు పాలు ఇవ్వజాలదు. అట్లే విగ్రహాల ముందు మనం పెట్టే ఫలహారాలను అవి తినలేవు. తిరిగి వాటినుండి మనం ఆత్మశక్తిని పొందలేము" స్థూలంగా ఇది అవధూత శ్రీ చిన్నమ్మ(1887-1957) గారి తత్వ బోధనా సారం. 

వెలిగే దీపమే మరొక దివ్వెను వెలిగిస్తుంది. కాగితం పై చిత్రించిన దీపపు బొమ్మ మరొక దీపాన్ని వెలిగించటానికి ఎలా పనికిరాదో అలాగే గుడిలో విగ్రహరూపంలోఉన్న దేవుని బొమ్మ ఆత్మ జ్యోతిని వెలిగించ లేదు. పరంజ్యోతి ని గురించి తెలుసుకోవాలంటే దాన్ని దర్శించిన లేదా తెలిసినవ్యక్తే సాధ్యపడుతుంది. అలాంటి బ్రహ్మ జ్ఞానం ఉన్న పరమ గురువును అన్వేషించాలి. వారినుండి జ్ఞాన బోధ పొందాలనే ప్రఘాఢమైన కోరిక మల్లిఖార్జున రావులో బలంగా నాటుకుపోయింది. 
పరమాత్మ అన్వేషి 


ఆలాంటి ఆత్మ జ్యోతిని వెలిగించగల జ్ఞాన గురువు కొరకు అలుపుసొలుపూ  లేకుండా వెతికిన నిరంతర అన్వేషి బ్రహ్మజ్ఞాన పిపాసి మల్లిఖార్జునరావు. విగ్రహారాధన అన్నా, దేవాలయ దర్శనమన్నా, పూజలు,   భజనలు అన్నా వీరికి ఏమాత్రం ఆసక్తి లేదు. తన భార్య లక్ష్మీదేవమ్మకు విగ్రారాధన భజనలన్న మక్కువ.  ఎవరి త్రోవ వారిదే.   "దైవం మానుషరూపం" అన్న నానుడి త్రికరణ శుద్ధిగా నమ్మిన వ్యక్తి కావటం చేత మానుషరూపంలో ఉన్న దైవాన్ని కనుగొనాలన్న చింతన ఆయన్ని ఇంటి పట్టున నిలకడగా ఉండలేక పోయాడు. 

"ఇంట్లో నిలువ లేను . నాకు ఇల్లు నా ఇల్లు కాకుండా పోయింది. చిరనూతనుదెవరో తోవనపడిపోతూ నన్నురమ్మని పిలుస్తున్నాడు . అతని అడుగుల చప్పుడు నా గుండెని తడుతోంది. బాధగా వుంది. గాలి రేగింది. కడలి మూల్గుతోంది. బాధ్యతల్నీ, సందేహాల్నీ మాని ఇల్లూవాకిలి లేని దేశదిమ్మరుల వెంట పడిపోతాను, తోవనపోయే ఆ చిరనూతనుడు నన్ను రమ్మని పిలుస్తున్నాడు" ఇవి ఫలసేకరణ లో సుప్రసిద్ధ రచయత గుడిపాటి వెంకటాచలం గారు చెప్పిన మాటలు. 

అచ్చం ఇదే ఆధ్యాత్మక తీరు మల్లిఖార్జున రావు లోను ఉండేది. ఎవరో పిలుస్తున్నట్లు తరుచు భార్యకు చెప్పకుండా,చెపితే వెళ్లనీయదేమోనని ఇంట్లో కావలిసినవన్నీ సమకూర్చి ఇల్లువదిలి అవధూతలను అన్వేషించటానికి వెళ్ళేవాడు. ఈ ప్రయాణం వారం,పది రోజులనుంచి నుంచి ఒక్కోసారి నెలా రెండు నెలలు ఉండేది. మహా సాద్వి లక్ష్మి దేవమ్మ ఎంతో ఓర్పుతో ఇంటిని చక్కబెట్టుకొచ్చేవారు.    
కనిపించిన ప్రతి యోగి/బాబాలోనూ,పకీరు/సన్యాసిలోనూ, జనబాహ్యుళ్యం లో ఆదరణ చూరగొన్న ప్రతి స్వామిజి/అవధూత లోను తనకు కావలిసిన పరమ గురువు ఉన్నాడేమోనని పరిశీలించేవాడు. ఆయన తిరగని పుణ్య తీర్థం లేదు, వెళ్లని మఠం లేదు. మతాచారాలను పాటించే స్వామిజీ ల ఆశ్రమాలను, పీఠాధిపతులను కలిసినా వీరు తృప్తి చెందలేదు. సామాన్య భక్తుల మాదిరి స్వామీజీలు, బాబాలు ఇచ్చే ఆశ్వీర్వాదాలు, విబూది,కుంకుమలు స్వీకరించేవాడు కాడు. ఒకసారి పుట్టపర్తి సత్య సాయిని దర్శించుకున్నప్పుడు వారు అందరికి ఇచ్చినట్లే విబూది మల్లిఖార్జున రావు కి ఇవ్వగా దాన్ని స్వీకరించలేదు. ఏమికావాలి అని ప్రశ్నించిన బాబాను నాకు ఏమికావాలో మీకు తెలుసు, దాన్ని ప్రసాదించమని అడగగా బాబా మౌనంగా వెళ్లిపోయాడని పుట్టపర్తినుండి తిరిగి వచ్చాడు. సత్యసాయి పై ఆరోపణలు వచ్చినప్పుడు "ఎలాంటి వాడైనా ప్రజలకు సేవలు అందిస్తున్నాడు కదా " అని మనస్సును సరిపుచ్చుకున్నాడు.

అరుణాచలం లోగల శ్రీ రమణ మహర్షి వారి ఆశ్రమాన్ని దర్శించి అక్కడ కొంతకాలం గడిపారు. వారి తత్వ సాహిత్యాన్ని ఆసాంతం చదివారు. 
"నాకు సాక్షాత్కారం కలుగుతుందా అనే సందేహం, నాకు సాక్షాత్కారం కలగలేదు అనే భావన -ఇవి రెండు సాక్షత్కారానికి ఆటంకాలు. అదేమీ కొత్తగా పొందేది కాదు. ఆత్మ సాక్షారించే ఉంది. కావలిసిందల్లా నాకు సాక్షాత్కారం కాలేదన్న తలంపును త్రోసివేయటమే" ఇది రమణ మహర్షి తత్వం. మల్లిఖార్జున రావు గారి సమస్యకు ఇది కొంత ఉపశమనం ఇచ్చింది. 
 పుదుచ్చేరిలోని  శ్రీ అరవింద మహర్షి, మదర్(మిర్రా అల్ఫాసా) ఆశ్రమం లో కొన్నాళ్ళు గడిపారు. 

మాత్రిమందిర్ - పుదుచ్చేరి 
"ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోండి. మనస్సులోకి కొత్తగా ఎటువంటి భావనలు రానీయకండి. మనస్సులోకి ఏవో కొత్త ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కొత్త ఆలోచన వచ్చేలోగా పాత ఆలోచనను బయటకు పంపండి. ఇలా ప్రయత్నిస్తే కొంతకాలానికి ఆలోచనారహితమైన నిశ్చిలావస్థకు చేరుకుంటారు" ఇది అరవిందుల ధ్యాన పద్ధతి. మల్లిఖార్జున రావు ఇదేరీతిలో నిశ్చలంగా పవళించి ధ్యానం చేసేవారు. వీరికి యోగాసనాలపై ఆసక్తి లేదు. అరవిందుల ఆశ్రమము నుండి వెలువడే మాస పత్రిక "ఆర్కా" క్రమం తప్పకుండా చదివేవారు.  
ఇంటిలో స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శారదాదేవి, అరవింద మహర్షి , మదర్, రమణ మహర్షి, చిన్నమ్మ ల ఫోటోలు ఉండేవి. 
అన్నార్తులకు అన్నదానం చేయటం పరమ పుణ్య కార్యక్రమం గా భావించి నిత్య అన్నదానం జరిగే గుడులకు, సత్రాలకు విరాళాలు ఇచ్చేవాడు. 
షిర్డీ సాయిబాబా గురించి తెలుగు నేలపై ప్రాచుర్యానికి రాక పూర్వమే(1970) మల్లిఖార్జునరావు షిర్డీకి సందర్శించి వారి చిత్రపటాన్ని ఇంటిలో ఉంచి ఆరాధించారు. అప్పట్లో ఇంటికి వచ్చిన ప్రతి వారు కుతూహలంతో ఆ పటాలలో ఉన్న వ్యక్తుల గురించి అడిగి తెలుసుకునేవారు.
తరువాయి ఐదొవ భాగం లో  

Monday, 24 October 2016

దంత వైద్య శిబిరం- 15-10 - 2016

కోమల చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్వహణలో ప్రకాశం జిల్లా పర్చూరు మండలం, వీరన్నపాలెం గ్రామంలో ది. 15- 10 -2016 న శ్రీ నవ్యభారత్ పాఠశాల ఆవరణలో జరిగిన ఉచిత దంత వైద్య శిబిరానికి సంబంధించిన ఛాయా చిత్రాలు.
సిబార్ వైద్య కళాశాల చైర్మన్ డా. యల్ . సుబ్బారావు , డా. మువ్వా సురేష్ బాబు  ల తో ట్రస్ట్ సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు 


 దంత సంరక్షణకు తీసుకోవాలిసిన ముందు జాగ్రత్తలను గురించి దంత వ్యాధుల గురించి 
విపులంగా వివరించుతున్న డాక్టర్ రావూరి శ్రీనివాస్ 


Friday, 21 October 2016

కోమల చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్వహణలో దంత వైద్య శిబిరం


కోమల చారిటబుల్ ట్రస్ట్ వారి నిర్వహణలో ప్రకాశం జిల్లా పర్చూరు మండలం,  వీరన్నపాలెం గ్రామంలో ది. 15- 10 -2016 న శ్రీ నవ్యభారత్ పాఠశాల ఆవరణలో ఉచిత దంత వైద్య శిబిరం ఏర్పాటు చేయబడినది. ముందుగా జరిగిన ట్రస్ట్ ఆవిర్భావ సదస్సును   సిబార్ దంత వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ లింగమనేని సుబ్బారావు గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తల్లిదండ్రుల పేరుతో ట్రస్టును ఏర్పాటు చేసి సమాజ సేవకు కంకణం కట్టుకున్న కోమల ట్రస్ట్ వ్యవస్థాపక ఛైర్మెన్ కొడాలి శ్రీనివాస్ ను అభినందించారు.  శ్రీనివాస్ అధ్యక్షత వహించిన ఈ సదస్సులో సిబార్ దంత కళాశాల వైద్యులు   డాక్టర్ మువ్వా సురేష్ బాబు, డా. మువ్వా శ్రీదేవి, డా. అప్పయ్య చౌదరి, గ్రామ సర్పంచ్ మక్కెన శేఖర్ బాబు, కొడాలి వినయ్ కుమార్, పైమరి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కన్నెగంటి కుమారస్వామి, హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు టి.శ్రీనివాస్, ట్రస్ట్ కార్యదర్శి గోరంట్ల రాఘవేంద్రరావు పాల్గొన్నారు. డా. రావూరి శ్రీనివాస్ గారు దంత సంరక్షణకు తీసుకోవాలిసిన ముందు జాగ్రత్తలను గురించి వ్యాధుల గురించి అవగాహన కల్గించారు. ఈ కార్యక్రమంలో రోగులకు మందులను ట్రస్ట్ వారు ఉచితంగా పంపిణి చేశారు. పాఠశాల విద్యార్థులకు టూత్ పేస్టులూ, బ్రష్ లూ, బిస్కెట్ ప్యాకెట్ లు పంచారు. ఈ దంత వైద్య శిబిరానికి ప్రజలనుండి విశేష స్పందన లభించింది. 


Sunday, 9 October 2016

అందరికి ఆహ్వానం


కీర్తి శేషులు కొడాలి మల్లిఖార్జున రావు గారి ప్రధమ వర్ధంతి ది. 14 అక్టోబర్ 2016 న వీరన్నపాలెంలో మా స్వగృహం లో జరుగుతుంది.  ఈ సందర్బంగా వీరన్న పాలెం గ్రామంలో ది. 15 అక్టోబర్ 2016 న "కొడాలి మల్లిఖార్జున రావు లక్ష్మిదేవమ్మ చారిటబుల్ ట్రస్ట్  (KOMALA CHARITABLE TRUST - Reg. 50/2016)" ఆవిర్బవ సదస్సు మరియు    ఉచిత  దంత వైద్య శిభిరం ఏర్పాటు చేస్తున్నారు. S.B.N. హైస్కూల్ ఆవరణలో జరిగే కార్యక్రమం లో  గుంటూరులో ఉన్న సిబార్ డెంటల్ కళాశాల మరియు హాస్పిటల్ వారు వైద్య సేవలు అందజేస్తున్నారు.
డాక్టర్ మువ్వా సురేష్ బాబు గారి సారధ్యంలో సిబార్ దంత వైద్యులు రోగులను పరీక్షించి తగిన చికిత్స చేస్తారు. ఈ వైద్య శిభిరంలో కోమల చారిటబుల్ ట్రస్ట్ వారు  అవసరమైన మందులను  రోగులకు ఉచితంగా పంపిణి చేస్తారు. అందరికి ఆహ్వానం, సుస్వాగతం.  
  
ఈనాడు-14-09-2016
ఆంధ్ర జ్యోతి -14-09-2016


స్ఫూర్తి ప్రధాత - 3

రెండవ భాగం తరువాయి 

చదువుల ప్రేముకుడు 

మల్లిఖార్జున రావు గారి ముగ్గురు ముద్దు బిడ్డలు  - 1967 
విద్య వివేకాన్ని, వివేకం వికాసాన్ని ప్రసాదిస్తే ఆ విద్య సరైన విద్య. ఇట్టి విద్యాబోధన జరగాలంటే అంకితభావం గల మంచి బోధకులు విద్యాలయాలలో ఉండాలి . విద్యార్థిని కేంద్రంగా చేసుకొని విద్యనందించే విధానం ఉండాలి. పిల్లలకు తెలవని/రాని విషయాలు తిరిగి లాలింపుగా నేర్పించాలే కానీ వాళ్ళను కఠినంగా దండించరాదు. విద్యార్థి చదువులో వెనకబడి ఉంటె లోపం ప్రధానంగా చదువు నేర్పే ఉపాధ్యాయుడిదే. అలాగే తల్లిదండ్రులు పిల్లల చదువులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పొలంలో విత్తనాలు చల్లినంతనే పంట చేతికి రాదుకదా!ఎప్పటికప్పుడు పైరును సంరక్షించితేనే పంట దిగుబడి బాగుంటుంది. ఇదే సూత్రం చదువుకి వర్తిస్తుంది. ఆస్తిపాస్తుల కంటే చదువు చాలా విలువైనది. ఆస్తులు అమ్మిఅయినా పిల్లలను బాగా చదివించాలి. అలాగే చదువుతో పాటు సంస్కారం రెండు పిల్లలకు అబ్బాలి. విద్య లేనివాడు వింతజీవి అని చదువుల బడి అమ్మ వడి ఒకటే అని భావించాలి. అక్కడ ఆటా పాటలకు కనీస వసతులు ఉండాలి. ఇవి మల్లిఖార్జునరావుకు విద్యపై ఉన్న కొన్ని అభిప్రాయాలు.   
వ్యవసాయం కంటే చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన ఆనాటికి వీరన్నపాలెంలో లేదు. ఉన్నత చదువులు చదివినవారు కానీ, ఉద్యాగాలు చేసేవారు కానీ గ్రామంలో వేళ్ళపై లెక్కించ వచ్చు. బడి మధ్యలో వదలి సరదాగా బండి తోలుతూ పొలానికి పోవాలన్నా పిల్లల కుతూహలాన్ని నిలువరించాలన్న నైజం ఆప్పటి తల్లితండ్రులకు లేదు.

1949 ప్రాంతంలోనే ముందుచూపుతో మద్దుకూరి నారాయణ రావు గారి ఆధ్వర్యంలో  గోరంట్ల రామయ్య చౌదరి ( కొడాలి లక్ష్మీదేవమ్మ గారి అన్నగారు) ఇచ్చిన స్థలంలో గ్రామ పెద్దలు "శ్రీ నవ్య భారతి  ప్రైమరీ పాఠశాల" ప్రారంభించారు. ఈ సరస్వతి నిలయాన్ని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోలేక పోయారు. గ్రామంలో చదువులపై ఉన్న చిన్నచూపు నిర్లక్ష్యం పోవాలని మల్లిఖార్జునరావు తపించారు. తన ముగ్గురు పిల్లలతో పాటు అందరి పిల్లలను బాగా చదివించాలని అలుపెరగని కృషి చేసారు. పిల్లలను బడికి పంపమని పోరు పెట్టేవాడు. స్కూల్ లో ఉపాధ్యాయులు విద్యార్థులపై తగినంత శ్రద్ధ తీసుకోవటం లేదని ప్రతేకంగా ట్యూషన్ చెప్పే ఉపాధ్యాయులను ఇతర ప్రాంతాలనుండి తీసుకువచ్చి పిల్లలకు చదువు చెప్పించాడు. వారికి సగం జీతం మల్లిఖార్జునరావే ఇచ్చేవాడు. ప్రతి నెల ట్యూషన్ పీజు నెలకు 5 లేక 10 రూపాయలు చెల్లించటానికి మనసు ఒప్పని పిల్లల తల్లిదండ్రులు వల్ల వచ్చిన ఉపాధ్యాయులు మూడు నాలుగు నెలలలోనే తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోయేవారు. పట్టువదలకుండా మరొక పంతులు గారిని వెతికి పట్టుకొని తీసుకువచ్చేవారు. ఒక్కోసారి మిగిలిన పిల్లలు పీజులు ఇచ్చినా ఇవ్వకున్నా అనుకున్న మొత్తం జీతం మల్లిఖార్జునరావుగారే చెల్లించేవారు. ఇలా మల్లిఖార్జునరావు గారి పెద్దఅబ్బాయి రమేష్ బాబు, అమ్మాయి లతామంజరి 7వ తరగతి శ్రీ నవ్య భారతి అప్పర్ ప్రైమరీ పాఠశాలలో పూర్తి చేసేవరకు అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆ తరువాత ఈ ఇద్దరినీ పరుచూరు Y.R. హైస్కూల్ లో చేర్పించారు. అప్పటికి వీరన్నపాలెం నుండి పర్చూరుకి రోడ్డు ఏర్పడలేదు. వర్షాకాలంలో చదువుకు ఆటంకం కలగరాదని కొన్నాళ్ళు పర్చూరులో ఇల్లు అద్దెకు తీసుకొని ఒక వంట మనిషిని పెట్టి మరి చదివించాడు. ఆ తరువాత తన బావమరిది బుచ్చియ్య చౌదరి ప్రధమ పుత్రుడు రాఘవేంద్రరావు తో అమ్మాయి లతకు పెళ్లి జరగటం, పెద్ద అబ్బాయి రమేష్ బాబు చదవు వద్దని మొండికేయటంతో ఒక మహా ప్రయత్నం విఫలమయ్యింది. అయితే ఆయన కృషి, కోరిక చిన్నబ్బాయి శ్రీనివాస్ విషయంలో విజయవంతమైంది. మనుమ సంతానం వినయ్, హిమజ, రేఖ, సాయికృష్ణ, చరణ్, సుధీర  ఆరుగురు ఉన్నత చదువులు చదవటం తో ఆయన తపస్సు ఫలించింది. మనస్సు సంతోషించింది. 
మనుమడు చరణ్ తో మల్లిఖార్జునరావు - 1989

ఆరోగ్య కార్యకర్త 


మల్లిఖార్జునరావు గారికి పిల్లలంటే ప్రేమ. వారి చదువంటే ప్రాణం. బాగా చదువుకునే వారంటే అమిత ఇష్టం. చదువుకునే పేద విద్యార్థులకు ఇతోధికంగా సహాయపడేవారు.
మనుమరాలు సుదీరతో
మల్లిఖార్జునరావు, లక్ష్మీదేవమ్మ
 -2001
అలాగే పిల్లల ఆరోగ్యం పై శ్రాద్దాశక్తులు ఎక్కువ. మల్లిఖార్జునరావు గారి తమ్ముడు రంగారావు M.B.B.S చదివి సత్తెనపల్లిలో వైద్యునిగా స్థిరపడ్డాడు. కొంతకాలం అక్కడ మందుల షాప్ పర్యవేక్షించిన అనుభవం వల్ల, మందుల వ్యాపారంలో తిరిగినందువల్ల మల్లిఖార్జునరావుకి ఆరోగ్యసంరక్షణాలపై మంచి అవగాహన ఉంది. తన పిల్లలకు వ్యాక్సిన్లు,టీకాలు దగ్గరుండి వేయించేవారు. అయితే 1967-68లో  ఊళ్ళో ఇద్దరు పిల్లలకు (మువ్వా హరిబాబు, వైశ్యుడు శ్రీశైలం గారి మనుమరాలు) పోలియో వచ్చి కాళ్ళు చచ్చుబడి పోవటం చూసి చలించి పోయారు. వెంటనే సత్తెనపల్లిలో ఉన్న తన తమ్ముని వైద్యశాల నుండి పోలియో మందులు తెప్పించి వీధి వీధి తిరిగి ఊరిలో ఉన్న పిల్లలందరకు పోలియో చుక్కలు వేపించారు. రెండు సంవత్సరాలపాటు ఈపోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించి అందరికి పోలియోపై అవగాహన కల్పించారు. ఆతరువాత ఎప్పటికో పోలియో రహిత భారత సామాజం కొరకు ప్రభుత్వాలు పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టటం ముదావహం. 

ఆధ్యాత్మక చింతన 

గుడిపాటి చలం

"ఇంట్లో నిలువ లేను . నాకు ఇల్లు నా ఇల్లు కాకుండా పోయింది. చిరనూతనుదెవరో తోవనపడిపోతూ నన్ను రమ్మని పిలుస్తున్నాడు . అతని అడుగుల చప్పుడు నా గుండెని తడుతోంది. బాధగా వుంది. గాలి రేగింది. కడలి మూల్గుతోంది. బాధ్యతల్నీ, సందేహాల్నీ మాని ఇల్లూవాకిలి లేని దేశదిమ్మరుల వెంట పడిపోతాను, తోవనపోయే ఆ చిరనూతనుడు నన్ను రమ్మని పిలుస్తున్నాడు"  ఇవి ఫలసేకరణ లో సుప్రసిద్ధ రచయత గుడిపాటి చలం గారు చెప్పిన మాటలు. అచ్చం ఇదే ఆధ్యాత్మక  తీరు మల్లిఖార్జున రావు లోను ఉండేది.
( మిగిలిన విషయాలు నాలుగో భాగంలో )