వీరన్న పాలెం గ్రామ చరిత్ర - 3

3.1  గ్రామ వృక్షాలు   

       గ్రామ నిర్మాణంలో బొడ్డురాయి కూడలి తరువాత మరో ప్రధానమైన సంగమ స్థానం పడమర బజారు, బొడ్డురాయి బజారు రెండు కలిసే కూడలి.  ఒక నాడు ఈ కూడలిలో శ్రీ మహాలక్ష్మీ దేవి  అంశగా పూజలు అందుకొనే పెద్ద వేప చెట్టు ఉండేది. ప్రతి శుభకార్యం జరుగుతున్నప్పుడు ఇక్కడన్న వేప చెట్టుని  పసుపు కుంకుమలతో పూజించేవారు. పకృతి ఆరాధనలో వృక్షారాధన ఒకటి. చల్లటి నీడను, ఆరోగ్యకరమైన గాలిని ప్రసాదించే వేప చెట్టు అమ్మ తల్లిగా భావించేవారు. ఇప్పుడు అక్కడ వేప చెట్టు కనుమరుగైంది. అయినా కానీ ఇప్పటికి గ్రామ జనులు పెండ్లి వంటి శుభకార్యక్రమాలు జరుపుకునే సమయంలో ఆ కూడలిలో(వీధి మధ్యలో) ఒక వేప కొమ్మని మట్టి ముద్దలో నాటి దానినే శ్రీ మహాలక్ష్మీ దేవిగా తలుస్తూ పూజలు చేస్తున్నారు. కుదించుకుపోయిన ఆ ప్రదేశంలో కొత్తగా మరో చెట్టు నాటే వెసులుబాటు నేడు లేదు. కాలగతిలో ఎన్ని మార్పులు వచ్చినా సమాజంలో బలంగా ఏళ్ళూనుకొని ఉన్న సాంప్రదాయాలు, ఆచారాలు ఏదో రకంగా ఆనాలోచనతో కొనసాగుతాయని చెప్పటానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది. 
        ఈ పడమటి కూడలికి నైరుతి దిశలో విష్ణువాలయం నిర్మించాలని 'మానసారం' లో చెప్పబడింది.  ఈ సూత్రాన్ని అనుసరించే మన వారు అక్కడ కనిష్ట ప్రమాణంతో  శ్రీ వేణు గోపాలస్వామి ఆలయం నిర్మించారు. 
        ఈ ఆలయం  ముందు ఉన్నఖాళీ ప్రదేశంలో గ్రామ వృక్షంగా కీర్తించబడే పెద్ద జువ్వి చెట్టు ఉండేది. పూర్వకాలంలో గ్రామ నాలుగు సరిహద్దులలో (పొలిమేరల వద్ద)  మర్రి, రావి, మేడి, జువ్వి వంటి క్షిరజాతి చెట్లు నాటేవారు. ఇవి  దీర్ఘ కాలం జీవిస్తూ గ్రామ సరిహద్దుల రక్షణ గుర్తుగా ఉంటాయి. ఇవి దాదాపు 400 సంవత్సరాలు పైబడి జీవిస్తాయి. మన గ్రామం లో ఉన్న ఈ జువ్వి చెట్టు కూడా 30 అడుగుల కైవార్యంతో నాలుగు తాళ్ల ప్రమాణంతో  నింగిని తాకే మహా వృక్షంగా వృద్ధి చెంది  సుదూర ప్రాంతాలకు స్పష్టంగా కనిపించేది. దీని వయస్సును బట్టి పరిశీలించితే గ్రామ నిర్మాణం జరగక మునుపే ఇది ఇక్కడ ఉందని తెలుస్తున్నది. అంతేకాకుండా ఈ జువ్వి చెట్టు గ్రామ వాస్తు ప్రకారం ఊరికి  ఉత్తర దిశలో పొలిమేర సరిహద్దుగా ఉండాలి. గ్రామం లోపల ఉండరాదు.  అందువలన మనం ఈ మహా వృక్షం పూర్వకాలం నాటిదిగా పరిగణించవచ్చు. వేలాది పక్షులకు ఆవాసంగా, గ్రామానికి తలమానికంగా, ఎన్నో తరాల వారికి నీడను ఇచ్చిన ఈ చెట్టు 1969 లో వచ్చిన గాలి వానకు ఒరిగి కాల గర్భంలో కలిసిపోయింది. మరల దీనికి సాటి రాగల  వృక్షం ఈ చుట్టుపక్కల ఎక్కడా కనిపించటం లేదు. అన్ని గ్రామాలవలే ఈ గ్రామం కూడా కాంక్రీటు కీకారణ్యంగా మారిపోయి పచ్చదనాన్ని కోల్పోయింది. 
  

3.2  బొడ్డురాయి - నాభి శిల 

గ్రామం నడి బొడ్డున స్థాపితం చేసిన రాయిని  బొడ్డు రాయి అంటారు. ఒక నూతన గ్రామాన్ని నిర్మించేటప్పుడు ముందుగా నివాస యోగ్యమైన ప్రదేశాన్ని ఎంచుకొని దానిలొ గ్రామ విన్యాసము పేరుతో భూమిని గ్రామ ప్రణాళిక ప్రకారం విభజన చేస్తారు. ఈ పద విన్యాసంలో మధ్య భాగాన్ని - 'బ్రహ్మ స్థానం' అని అంటారు. ఈ మధ్య ప్రదేశంలో గ్రామ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తూ ఒక రాతి శిలను ఉంచుతారు. దీనికి నాభిశిల అనే మరో పేరు. ఇది గ్రామ నడిబొడ్డున ఉంటుంది కాబట్టి దీన్ని వాడుకలో బొడ్డురాయి గా పిలుస్తారు. ఈ బొడ్డురాయి కేంద్రంగా చేసుకొని గ్రామంలో ప్రధాన వీధులు ఉంటాయి. తూర్పు - పడమర దిశలకు అభిముఖంగా  ఉన్న వీధిని 'సూర్యవీధీ' అని, ఉత్తర - దక్షిణ దిశలకు  అభిముఖంగా  ఉన్న వీధిని 'చంద్ర వీధీ' అని పిలుస్తారు. ఈ వీధులు రెండు ఒకదానికొకటి లంబకోణంలో  ఉంటూ అవి రెండు కలిసే మధ్య బిందువు వద్ద బొడ్డు రాయి ఉంటుంది.  ఇది గ్రామ నాభి స్థానం గా చెప్పబడింది.  ఇలా బొడ్డురాయి వీరన్నపాలెం గ్రామ మధ్య ఉంది. గ్రామంలో జరిగే అన్ని శుభకార్యక్రమాలలో దీనికి పూజాపునస్కారాలు చేయటం ఒక ఆచారంగా వస్తున్నది. గ్రామంలో ఇదే ముఖ్య కూడలి కాబట్టి తగాదాలకు,తీర్పులకు ఒక వేదికగా ఉంది. గ్రామ దేవతల జాతర (కొలుపులు) ఇక్కడే నుండే మొదలు పెట్టేవారు.

3. 3 శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం 

        
శ్రీ వేణుగోపాల స్వామి

        వీరన్నపాలెం గ్రామంలోని  దేవాలయాలలో ప్రముఖమైనది మరియు ప్రాచీనమైనది శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం. ఈ దేవాలయానికి సంభందించిన రాగి శాసనాలు, శిలాఫలకాలు ఏవి లభ్యం కావటం లేదు. జనశృతి ని బట్టి తొలుత వేణుగోపాల స్వామి వారి విగ్రహం ఒక చెట్టు (రావి) నీడలో కొలువై ఉందని, ఆతరువాత  తూర్పు ముఖద్వారంతో చిన్న ఆలయం  (కనిష్ఠ ప్రమాణం) ను సామాన్య శకం 1850 ప్రాంతంలో నిర్మించబడిందని తెలుస్తున్నది. ఈ ఆలయం దండకనామ గ్రామ ప్రణాళికలో సూచించిన ప్రదేశంలోనే నిర్మించారు. ఈ దేవాలయంలో పూజాదికాలు చేయటానికి ఒక పూజారి ప్రతి దినం ఉప్పుటూరు నుండి వచ్చేవారు. ఆ తరువాత పూజారి కుటుంభం ఇక్కడే నివాసం ఉండటానికి దేవాలయం ప్రక్కన దక్షిణ దిశలో ఒక గృహాన్ని నిర్మించారు. 
            ఈ దేవాలయానికి 29.85 ఎకరాలు పంట భూమి ఏక ఖంఢంగా (సర్వే నెం.183) మాన్యంగా ఉంది. దీనిలో 11.75 ఎకరాలు ధూపదీప నైవేద్యాల కొరకు దేవాదాయ శాఖ వారి ఆధీనంలో ఉంది. మిగిలిన 18.10 ఎకరాలు అర్చక భోజ్యం కొరకు కేటాయించారు. 
    ఈ దేవాలయంలో పూర్వాభిముఖంగా  ప్రతిష్టించిన వేణుగోపాల స్వామి విగ్రహం యొక్క శిల్పకళా శైలి  17-18 శాతాబ్దములలో రూపొందించిన  శిల్పాలను పోలిఉంది. ఈ నల్ల రాతి  ప్రతిమ షుమారు మూడు అడుగుల ప్రమాణంతో పీఠంపై ఉంది.  ఏక శిలపై "స్వస్తికాసనం"లో వేణువు చేబూనిన ఈ  శ్రీ కృష్ణుని ప్రతిమ దాని వెనుక భాగంలో మఖర తోరణంతో చెక్కబడి ఉంది. ఈ తోరణం త్రిభుజాకారంలో ఉండి   ఒక ప్రభను పోలివుంది. ఈ తోరణంలో పై భాగంలో కుడి ప్రక్క శంఖువు, ఎడమ ప్రక్క సుదర్శన చక్రం, కింది భాగంలో కుడి ప్రక్క రుక్మిణి దేవి, ఎడమ ప్రక్క సత్యభామ చిత్తరువులు చెక్కబడి ఉన్నాయి.

3.3.1 ఆంజనేయ స్వామి దేవాలయం  

        ఈ దేవాలయ ప్రాంగణంలో ప్రధాన దేవాలయానికి అభిముఖంగా క్షేత్ర పాలకుడిగా ఉన్న ఆంజనేయ స్వామి వారి దేవాలయం పశ్చిమాభిముఖంగా  ఉంది. దీనిలో ప్రతిష్టించిన హనుమ విగ్రహం దక్షిణాభిముఖంగా ఉన్నది. ఈ విగ్రహాం 'భక్త శిఖాంజనేయుడు' గా  ప్రసిద్ధి చెందింది. 
భక్త శిఖాంజనేయుడు

            మూగ రాతి బండపై ఉబ్బెత్తుగా చెక్కిన ఈ ఆంజనేయ స్వామి విగ్రహం యొక్క శిల్పకళా శైలి  15-16 శాతాబ్దములలో రూపొందించిందిన  శిల్పాలను పోలిఉంది. కాబట్టి ఈ విగ్రహం శ్రీ వేణుగోపాల స్వామి వారి విగ్రహం కంటే పురాతనమైనదిగా తెలుస్తున్నది. అయితే ప్రధాన దేవాలయం నిర్మాణం జరిగిన  షుమారు 60 ఏళ్ల తరువాతనే (1910 ప్రాంతంలో) ఈ ఆంజనేయస్వామి దేవాలయం నిర్మించారు. జనశృతి ప్రకారం చీరాల/చిలకలూరి పేట పరిసర గ్రామాలలో ఒక ప్రదేశంలో  పూజాపునస్కారాలు లేకుండా ఆరుబయట పడివున్న ఈ విగ్రహాన్ని అక్కడి వారి అనుమతితో  ఇక్కడికి తరలించినట్లు తెలుస్తున్నది. 
        శ్రీ వేణుగోపాల స్వామి వారికి ఎదురుగా పశ్చిమ ముఖద్వారంతో ప్రధాన ఆలయం కన్నా చిన్నదైన గుడిని కట్టి దానిలో దక్షిణాభిముఖంగా ఆంజనేయ స్వామి వారు ఉండేలా విగ్రహ ప్రతిష్టి చేసారు. ఇదే విగ్రహాన్ని తూర్పు అభిముఖంగా ముఖ ద్వారం ఉన్న దేవాలయంలో ఉంచితే అది ఉత్తరాభిముఖ ఆంజనేయ స్వామిగా పిలుస్తారు. వాస్తు శాస్త్రానుసారం ఆంజనేయ స్వామి దక్షిణాభిముఖంగా ఉండాలని చెప్పబడింది. అభయ ఆంజనేయ స్వామిని దక్షిణాభిముఖంగా ప్రతిష్టించాలి. కానీ ఈ దేవాలయాలు తూర్పుకు అభిముఖంగా ఉంటున్నాయి. 

3.3.2 నాగ దేవతలు  

జంట నాగ దేవతలు 
            ఈ దేవాలయం ప్రాంగణంలో ఈశాన్య దిశలో దక్షిణాభిముఖంగా ప్రాచీనమైన జంట నాగ దేవతల రాతి  విగ్రహం ఒకటి ఉంది.(నాగ దేవతలు దక్షిణాభిముఖ దేవతలుగా చెప్పబడ్డారు). సంతాన సాఫల్యం కొరకు జంట నాగ దేవతలను ఆరాధించటం అనాదిగా ఉంది. సాధారణంగా నాగ దేవతల విగ్రహాలు చెట్ల వద్ద, పుట్టల వద్ద ఉంటాయి. బహుశా ఇది కూడా మొదట్లో చెట్టు నీడలో ఉండి ఆ తరువాత ఈ గుడి ప్రాంగణంలోకి వచ్చినట్లు తెలుస్తుంది. 

3.3.3  ధ్వజ స్తంభం

        సామాన్య శకం 1870 ప్రాంతంలో ఈ దేవాలయానికి ధ్వజ స్తంభం వేసిన ఆధారాలు పాత దేవాలయ ధ్వజ స్తంభం తొలగించిన్నప్పుడు లభించాయి. ఈ దేవాలయానికి ధ్వజ స్తంభం గోరంట్ల వీర రాఘవయ్య (మన్సుబుగారు) తండ్రిగారైన  రామయ్య చౌదరి వారి తండ్రి గారైన బుచ్చియ్య గారి పుణ్యం కొరకు వేయించినట్లు ఆనాటి ధ్వజస్తంభం రాగి తొడుగుపై  వ్రాయబడి ఉంది. ఈ దేవాలయ సముదాయానికి  చుట్టూ ప్రహరీ గోడ ఉండి తూర్పుదిశలో చిన్న గోపురంతో ప్రవేశ ద్వారం ఉంది. 

3.3.4  వాహన శాల 

        దేవాలయం ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలో దక్షిణ దిశలో ఒక చిన్న వాహన శాల ఉంది. దంతెలతో ఒక హాలు దానికి ముందు పెంకుల పంచతో ఉన్న ఈ శాల సా.శ 1940-50 ప్రాంతంలో నిర్మించినట్లు తెలుస్తుంది. దేవాలయం సంబంధించిన వస్తువులు, గ్రామోత్సవంలో ఉరేగించే ఉత్సవ వాహనాలు, రథ మందిరం వంటివి దీనిలో భద్రపరిచేవారు. ఈ దంతెల శాల ముందు భాగంలో వరండా (పెంకుల పంచ) ఉండేది. ఇది ఏ ఆధారం లేని వారికి, బాటసారుల రాత్రి బసకు ఉపయోగపడేది. అందుకే దీన్ని అందరు సత్రంగా పిలిచేవారు. ఈ సత్రం వరండానే గ్రామంలో జరిగే హరికథ, బుర్రకథ, పురాణ ప్రవచనాల వంటి కార్యక్రమాలకు వేదికగా ఉండేది. గ్రామ కచేరిగా కుడా ఉపయోగపడింది. 

3.3.5  దేవాలయ పునర్నిర్మాణం  

            ఈ దేవాలయానికి  1991లో మొదటిసారి మరమత్తులు చేసి భక్తులకు సౌకర్యంగా ఉండేలా మండపాన్ని నిర్మించారు. విశాలమైన  మండప నిర్మాణం కొరకు ఆంజనేయ స్వామి కొలువై ఉన్న గుడిని తొలగించి అక్కడివరకు మండపం నిర్మించారు. గుడి ప్రాంగణం అంతా మెరకచేసి నాప రాళ్లు పరిచారు. ఆ తరువాత కొంతకాలానికి దేవాలయం చుట్టునున్న భూపరితలం వెలుపలి ప్రదేశం కంటే దిగువకు పోయి గుడిలో వర్షపు నీరు నిలుస్తూ అసౌకర్యంగా తయారైంది.  దేవాదాయ శాఖ వారి సౌజన్యం మరియు భక్తుల విరాళాలతో ఈ దేవాలయాన్ని  పునర్మించాలని 2004లో నిర్ణయించారు. పాత దేవాలయ ఆవరణతో పాటు దాని ముందు ఆగ్నేయ మూలలో ఉన్న వాహనశాల (సత్రంగా ప్రసిద్ధి పొందింది)ను  తొలగించి, ఎదురుగా  ఉన్న ఖాళీ ప్రదేశాన్ని తీసుకోని విశాలమైన దేవాలయాన్ని మక్కెన కృష్ణయ్య గారి సారథ్యంలో దేవాలయ కమిటీ వారు నేటి ఆధునిక దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయ నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన దాతల పేర్లతో శిలా ఫలకాలు దేవాలయ ఆవరణలో ఉన్నాయి. 
            పాత దేవాలయంలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామితో పాటు  కొత్తగా రుక్మిణీదేవి, సత్యభామ అమ్మవార్ల విగ్రహాలు తయారుచేయించి 2009 నవంబరు మాసం లో  గర్భాలయంలో ప్రతిష్టించారు. వీటితో పాటు దక్షిణాభిముఖంగా ఉన్న పురాతన ఆంజనేయ స్వామి వారికి పూర్వంలా పశ్చిమాభిముఖంగా ప్రత్యకమైన ఆలయాన్నిఏర్పరిచారు. అలాగే ప్రాచీన మైన జంట నాగదేవతల విగ్రహాన్ని ఈశాన్య దిశలో  నాగ పడగ వేదికపై దక్షిణాభిముఖంగా ప్రతిష్టించారు. ఆలయం ముందు 24 అడుగుల ధ్వజ  స్తంభాన్ని, విశాలమైన ముఖ మండపాన్ని, ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రహరీ ప్రవేశ ద్వారం నిర్మించారు.  
రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి 



 

Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి

వీరన్న పాలెం గ్రామ చరిత్ర - 2