కర్మ యోగి మల్లిఖార్జున రావు-4

శ్రీ చిన్నమ్మ 

స్ఫూర్తి ప్రధాత - 4  

ఆధ్యాత్మక చింతన

ఆధ్యాత్మక భావనలు మెండుగా గల మల్లిఖార్జునరావుకు కాకతాళీయంగా రేపల్లె అవధూత శ్రీ చిన్నమ్మను దర్శించాక వారి చింతనలో కొంత స్పష్టత చేకూరింది.
"చెట్టు బొమ్మ నుండి విత్తనాలు, ఆవు బొమ్మనుండి పాలు, దేవుని బొమ్మల నుండి మోక్షాన్ని సాదించలేరు. ఆవు బొమ్మ మనం వేసిన ఆహారాన్ని తినజాలదు. పోసిన నీరు త్రాగలేదు. మనకు పాలు ఇవ్వజాలదు. అట్లే విగ్రహాల ముందు మనం పెట్టే ఫలహారాలను అవి తినలేవు. తిరిగి వాటినుండి మనం ఆత్మశక్తిని పొందలేము" స్థూలంగా ఇది అవధూత శ్రీ చిన్నమ్మ(1887-1957) గారి తత్వ బోధనా సారం. 
వెలిగే దీపమే మరొక దివ్వెను వెలిగిస్తుంది. కాగితం పై చిత్రించిన దీపపు బొమ్మ మరొక దీపాన్ని వెలిగించటానికి ఎలా పనికిరాదో అలాగే గుడిలో విగ్రహరూపంలోఉన్న దేవుని బొమ్మ ఆత్మజ్యోతిని వెలిగించ లేదు. పరంజ్యోతిని గురించి తెలుసుకోవాలంటే దాన్ని దర్శించిన లేదా తెలిసినవ్యక్తికే సాధ్యపడుతుంది. అలాంటి బ్రహ్మజ్ఞానం ఉన్న పరమగురువును అన్వేషించాలి. వారినుండి జ్ఞానబోధ పొందాలనే ప్రఘాఢమైన కోరిక మల్లిఖార్జున రావులో బలంగా నాటుకుపోయింది.

అలుపెరుగని అన్వేషి

దేశంలో అడుగడుగునా బాధ గురువులే కానీ బోధ గురువులు మృగ్యం అవుతున్న తరుణంలో ఆత్మ జ్యోతిని వెలిగించగల జ్ఞానబోధ గురువు కొరకు అలుపుసొలుపూ లేకుండా వెతికిన నిరంతర అన్వేషి, బ్రహ్మజ్ఞాన పిపాసి మల్లిఖార్జునరావు. 
విగ్రహారాధన అన్నా, దేవాలయ దర్శనమన్నా, పూజలు, భజనలు తీర్ధ యాత్రలన్నా వీరికి ఏమాత్రం ఆసక్తి లేదు. తన భార్య లక్ష్మీదేవమ్మకు విగ్రారాధన భజనలన్న మక్కువ. ఎవరి త్రోవ వారిదే. 
"దైవం మానుషరూపం" అన్న నానుడి త్రికరణ శుద్ధిగా నమ్మిన వ్యక్తి కావటం చేత మానుషరూపంలో ఉన్న దైవాన్ని కనుగొనాలన్న చింతన ఆయన్ని ఇంటి పట్టున నిలకడగా ఉండలేక పోయాడు. 
గుడిపాటి వెంకటాచలం 

"ఇంట్లో నిలువ లేను . నాకు ఇల్లు నా ఇల్లు కాకుండా పోయింది. చిరనూతనుదెవరో తోవనపడిపోతూ నన్నురమ్మని పిలుస్తున్నాడు . అతని అడుగుల చప్పుడు నా గుండెని తడుతోంది. బాధగా వుంది. గాలి రేగింది. కడలి మూల్గుతోంది. బాధ్యతల్నీ, సందేహాల్నీ మాని ఇల్లూవాకిలి లేని దేశదిమ్మరుల వెంట పడిపోతాను, తోవనపోయే ఆ చిరనూతనుడు నన్ను రమ్మని పిలుస్తున్నాడు" ఇవి ఫలసేకరణ లో సుప్రసిద్ధ రచయత గుడిపాటి వెంకటాచలం గారు చెప్పిన మాటలు. 
అచ్చం ఇదే ఆధ్యాత్మక తీరు మల్లిఖార్జునలో కూడా ఉండేది. ఎవరో తనను రా రమ్మని పిలుస్తున్నట్లు, తరుచు ఇల్లువదిలి అవధూతలను అన్వేషించటానికి వెళ్ళేవాడు. ఈ ఒంటరి ప్రయాణం వారం,పది రోజులనుంచి నుంచి ఒక్కోసారి నెలా రెండు నెలలు ఉండేది. ఇంటి అవసరాలకు కావలిసిన సరుకులతో పాటు కొంత నగదు బీరువాలో ఉంచి ఊరికి పోతున్నానని వెళ్ళేవాడు. కొన్నిసార్లు అయితే తనకు తలంపు వచ్చినదే తడువుగా ఇంటిలో ఇల్లాలికి కూడా చెప్పా కుండా దేశాటనకు వెళ్ళేవాడు. ఈ ఆధ్యాత్మక యాత్ర వారం పది రోజులనుండి రెండు మూడు నెలలు పాటు ఉండేవి. వెంట తీసుకొని పోయిన డబ్బు పూర్తిగా ఖర్చు అయినా తరువాత కానీ, అనారోగ్యం పాలైతే మాత్రమే మరల తిరిగి ఇంటికి రావాలన్న ధ్యాస వచ్చేది. ఇలా ఒంటరిగా యాత్రలకు వెళ్ళటం తరుచూ జరిగే విషయమే కాబట్టి మహా సాద్వి లక్ష్మి దేవమ్మ ఎంతో ఓర్పుతో, నేర్పుతో ఇంటిని, పిల్లలను చక్కబెట్టుకొచ్చేవారు.
కర్మ యోగి మల్లిఖార్జున రావు
కనిపించిన ప్రతి యోగి/బాబాలోనూ,పకీరు/సన్యాసిలోనూ, జనబాహ్యుళ్యం లో ఆదరణ చూరగొన్న ప్రతి స్వామిజి/అవధూత లోను తనకు కావలిసిన పరమ గురువు ఉన్నాడేమోనని నిశితంగా పరిశీలించేవాడు. ఆయన తిరగని పుణ్య తీర్థం లేదు, వెళ్లని మఠం లేదు. మతాచారాలను పాటించే స్వామిజీ ల ఆశ్రమాలను, పీఠాధిపతులను కలిసినా వీరు సంతృప్తి చెందలేదు. 
సామాన్య భక్తులవలె స్వామీజీలు, బాబాలు ఇచ్చే ఆశ్వీర్వాదాలు, విబూది,కుంకుమలు స్వీకరించేవాడు కాడు. ఒకసారి పుట్టపర్తి సత్య సాయిని దర్శించుకున్నప్పుడు వారు అందరికి ఇచ్చినట్లే విబూది రావు గారికి ఇవ్వగా వారు దాన్ని స్వీకరించలేదు. ఆశ్చర్యంగా మీకు ఏమికావాలి అని ప్రశ్నించిన బాబాను "సర్వజ్ఞుడివి నాకు ఏమికావాలో మీకు తెలుసు, దాన్ని ప్రసాదించమని" అడగగా బాబా మౌనంగా ముందుకు వెళ్లిపోయాడని పుట్టపర్తినుండి నిరాశగా తిరిగి వచ్చాడు. సత్యసాయిపై అనేక ఆరోపణలు వచ్చినప్పుడు "బాబా ఎలాంటి వాడైనా ప్రజలకు సేవలు అందిస్తున్నాడు కదా " అని మనస్సును సరిపుచ్చుకున్నాడు. 
అరుణాచలం లోగల శ్రీ రమణ మహర్షి వారి ఆశ్రమాన్ని దర్శించి అక్కడ కొంతకాలం గడిపారు. అక్కడి ప్రశాంత వాతావరణం, రమణ మహర్షి గారి దర్శనం రావు గారి మనస్సుకు కొంత ఉపశమనం ఇచ్చింది. రమణుల తత్వ సాహిత్యాన్ని ఆసాంతం చదివారు. 
"నాకు సాక్షాత్కారం కలుగుతుందా అనే సందేహం, నాకు సాక్షాత్కారం కలగలేదు అనే భావన - ఇవి రెండు సాక్షత్కారానికి ఆటంకాలు. అదేమీ కొత్తగా పొందేది కాదు. ఆత్మ సాక్షారించే ఉంది. కావలిసిందల్లా నాకు సాక్షాత్కారం కాలేదన్న తలంపును త్రోసివేయటమే" ఇది రమణ మహర్షి తత్వం. మల్లిఖార్జున రావు గారి సమస్యకు ఇది కొంత ఉపశమనం ఇచ్చింది. 
రమణ మహర్షి ఆశ్రయం తరువాత అంతగా ప్రభావితమైన జీవిత సత్యాల్ని పుడిచ్చేరి లోని శ్రీ అరవింద మహర్షి, వారి శిషురాలు మదర్(మిర్రా అల్ఫాసా) ఆశ్రమం లో రావు గారు తెలుసుకున్నారు. 
అరవిందుల తత్వ దర్శనంలో మాయా ప్రమేయమే లేదు. అరవిందులు అద్వైతులు ప్రతిపాదించే నిర్గుణ పరబ్రహ్మ అధ్యాత్మికాన్వేషకుని సాధనలో ఒకమెట్టు మాత్రమే అనీ, దీనికి పైన అతిమానసిక భూమికలు క్రమక్రమంగా అనేకం ఉన్నాయని, అన్నింటికి పైన విజ్ఞాన భూమిక (Supra mental Plane) ఉన్నదనీ చెబుతున్నారు. ఆ భూమికల కన్నింటికీ దిగువన సైకోఅనాలిసిస్ చెప్పే (Sub conscious) అవ్యక్త మనస్సు కూడా ఉన్నదని అంగీకరిస్తారు. ఈ రెండు భూమికలకు మధ్యన ఇంకా అనేకమైన భూమికలున్నవని ప్రతిపాదించారు. అయితే ఈ భూమికలన్నిటిలోను దివ్య చైతన్యం అంతర్గతమై ఉన్నదని, క్రమంగా ఊర్ధ్వంగా అధిరోహించినకొలది ఈ చైతన్యం స్వయంప్రకాశమాన మవుతున్నదని వారి అభిప్రాయము. ఈ తత్వ బోధన ఒక పట్టాన అర్ధం అయ్యే విషయం కాదు.
మాత్రి మందిర్ - ఆరోవిల్లి అంతర్జాతీయ నగరం, పుడిచ్చేరి 
"ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోండి. మనస్సులోకి కొత్తగా ఎటువంటి భావనలు రానీయకండి. మనస్సు లోకి ఏవో కొత్త ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కొత్త ఆలోచన వచ్చేలోగా పాత ఆలోచనను బయటకు పంపండి. ఇలా ప్రయత్నిస్తే కొంతకాలానికి ఆలోచనారహితమైన నిశ్చిలావస్థకు చేరుకుంటారు" ఇది అరవిందుల ధ్యాన పద్ధతి. 
మల్లిఖార్జున రావు ఇదేరీతిలో నిశ్చలంగా పవళించి ధ్యానం చేసేవారు. వీరికి యోగాసనాలపై ఆసక్తి లేదు. అరవిందుల ఆశ్రమము నుండి వెలువడే మాస పత్రిక "ఆర్కా" క్రమం తప్పకుండా చదివేవారు. 
ఇంటిలో స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, శారదాదేవి, అరవింద మహర్షి , మదర్, రమణ మహర్షి, షిర్డీ సాయి,చిన్నమ్మ ల ఫోటోలు ఉండేవి. 
షిర్డీ సాయిబాబా గురించి తెలుగు నేలపై ప్రాచుర్యానికి రాక పూర్వమే(1970) వీరు షిర్డీ క్షేత్రాన్ని సందర్శించి సాయి చిత్రపటాన్ని ఇంటిలో ఉంచి ఆరాధించారు. అప్పట్లో ఇంటికి వచ్చిన ప్రతి వారు కుతూహలంతో ఆ పటాలలో ఉన్న వ్యక్తుల గురించి అడిగి తెలుసుకునేవారు. 

శ్రీ వెంకయ్య స్వామి 
అవధూత  అంటే ఆత్మ పరమాత్మల మధ్య అంతరాన్ని తొలగించి జీవనముక్తి మార్గం బోధించే గురువు, వీరిలో కొందరిని పరమహంస లని కూడా అంటారు. అలాంటి వారికొరకు మల్లిఖార్జున రావు ఎంత దూరమైనా ప్రయాణం చేసి వారిని దర్శించుకొనేవారు. 

నెల్లూరు సమీపం లోని గోగులమూడి వెంకయ్య స్వామి ఆశ్రమం, కడప జిల్లా బ్రహ్మం గారి మఠం, అవధూత కాశీనాయన ఆశ్రమం, చిత్తూరు ఏర్పేడు ఆశ్రమం, తమినాడులోని సొరకాయల స్వామి ఆశ్రమం, గుంటూరు జిల్లా జిల్లెళ్ళమూడి అమ్మ, ముమ్మడివరం పెద్ద బాలయోగి, చిన్న బాలయోగి ఒక్కరేమిటి ఆనాటికి తనకు ఎరుక పడిన అనేక చిన్న, పెద్ద ఆశ్రమాలను, మఠంలు సందర్శించారు. 
1978లో పెద్ద కుమారుడు రమేష్ బాబుకి నాగులపాలెం వాసులు పొట్రు సుబ్బారావు, శాంతమ్మ గారి పెద్ద కుమార్తె సుజాత రాణి తో ను 1985లో చిన్న కుమారుడు శ్రీనివాస్ కి నాగులపాలెం వాసులైన యార్లగడ్డ రంగయ్య, వెంకట సుబ్బమ్మ గారి చిన్న కుమార్తె రాఘిణి తో వివాహం జరిపించారు. దానితో తన బాధ్యతలు తీరాయని సంతోష పడ్డారు. ఇక శేష జీవితం ఆధ్యాత్మిక చింతనలో గడపొచ్చోని తలచారు. 
తరువాయి ఐదొవ భాగం లో

Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

వీరన్న పాలెం గ్రామ చరిత్ర - 2

కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి