మానవతావాది డాక్టర్ కొడాలి రంగారావు

ప్రజా వైద్యుడు .సత్తెనపల్లి పరిసర ప్రజలకు దాదాపు నాలుగు దశాబ్దాలు విశేష వైద్య సేవలు అందించిన మానవతావాది ఆదర్శమూర్తి డాక్టర్ కొడాలి రంగారావు.

డాక్టర్ రంగారావు గారు గుంటూరు జిల్లా అమృతలూరు మండలం మోపర్రు గ్రామంలో కొడాలి వెంకట్రామయ్య, లక్ష్మి నరసమ్మ దంపతులకు 1938 ఏప్రిల్ 22న జన్మించారు. వీరికి గోపాల కృష్ణయ్య, మల్లిఖార్జున రావు అనే ఇద్దరు అన్నలు,ధన లక్ష్మీ అనే అక్కయ్య ఉన్నారు. రంగారావు గారి హైస్కూల్ విద్య తురిమెళ్ళ లోను,PUC గుంటూరు హిందూ కాలేజీ లోను, వైద్య విద్య MBBS ను మణిపాల్ కే.ఎం.సి కళాశాల లో చదివారు. 1961 లో తన సోదరి గోగినేని ధనలక్ష్మి,దేవయ్య గార్ల కుమార్తె ఉమాదేవిని వివాహం చేసుకున్నారు.

వామ పక్ష భావాలు గల రంగారావు గారు రోగుల పట్ల చాలా ఉదారంగా ఉండేవారు. తొలుత తెనాలిలో డాక్టర్ కుర్రా వీరరాఘవయ్య, డాక్టర్ కొడాలి వీరయ్య చౌదరి గార్ల వద్ద కొద్ది కాలం వైద్యునిగా పనిచేసి నైపుణ్యం గడించారు. ఆ తరువాత   వైద్య సదుపాయాలు ఏమాత్రం లేని గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి అనే గ్రామీణ ప్రాతంలో 1962 లో తొలి ప్రజా వైద్య శాల "నాగార్జున నర్సింగ్ హోమ్" ను స్థాపించి వెనకబడిన పలనాటి గ్రామీణ ప్రాంత వాసులకు వైద్య సేవలు అందించారు. ఆరోజులలో ప్రత్యేకంగా మత్తు వైద్యులు లేకపోయినా అన్ని తానై మంచి సర్జన్ గా ఒంటి చేతితో ఎందరికో ప్రాణదానం చేసినారు. రోగులకు  అనవసరపు మందుల వాడకాన్ని, రోగ నిద్దారణ పరీక్షలు చేయటాన్ని నిరసించేవారు. 
1979 నుండి 1983 మధ్య కాలంలో పశ్చిమ ఆసియా లోని ఇరాక్ దేశంలో వైద్య సేవలు అందించారు. వృత్తి ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా పాటించే జనరల్ వైద్యునిగా, అమృత హస్తవాసిగా వైద్యో నారాయణా హరి అనే నానుడికి వన్నె తెచ్చిన ధన్య జీవి.
డాక్టర్ రంగారావు హేతువాది, వామ పక్ష భావజాలం ఉన్న వ్యక్తి. అభ్యుదయ సాహిత్యాన్ని అధ్యయనం చేశారు. రామాయణం, బైబుల్ వంటి మత గ్రంధాలను నిశితంగా విశ్లేషించి వాటి హేతుబద్దతను, ప్రామాణికతను ప్రశ్నించేవారు.సాహిత్య,కళారంగాలపై మక్కువతో జూన్ 2, 1979లో ప్రముఖ కవి,సినీ రచయత (దాన వీర శూర కర్ణ మాటల రచయత),హేతువాది,కవిరాజు కళాప్రపూర్ణ కొండవీటి వెంకటకవి గారి కవితా బ్రహ్మోత్సవాన్ని అత్యంత వైభవంగా సత్తెనపల్లిలో నిర్వహించారు.
పద్మశ్రీ ఎన్టీఆర్ గారితో డా. రంగారావు, శ్రీమతి ఉమాదేవి    2-6-1979
ఈ అబినందన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సినీనటులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు, కళావాచస్పతి పద్మభూషణ్ కొంగర జగ్గయ్య, స్వతంత్ర యోధులు పద్మభూషణ్ వావిలాల గోపాలకృష్ణయ్య గారు వచ్చారు. ఎడ్ల బండి కట్టి అంగరంగ వైభవంగా ఎన్టీఆర్ ను వెంకట కవిని సత్తెనపల్లి పురవీధులలో ఊరేగించారు. అశేష జనవాహిని తో సత్తెనపల్లి ముద్దు బిడ్డ వెంకట కవికి జరిగిన ఈ పౌర సత్కారం అపూర్వం. వీరు సత్తెనపల్లి తాలూకా విప్పర్ల లో జన్మించారు.  కొండవీటి వెంటకవి కలం నుండి జనించిన దాన వీర శూర కర్ణ డైలాగులు ఎన్టీఆర్ నోటినుండి జాలువారి వారి కీర్తిని విశ్వవ్యాప్తం చేసింది. కవి గారిపై ఉన్న అపార అభిమానంతో ఈ సత్కారంలో పాల్గొన్న అన్న ఎన్టీఆర్ గారు ఆరోజు రంగారావు గారి ఇంటిలోనే బస చేశారు. 
కొండవీటి వెంకట కవి ,ఎన్టీఆర్ లతో కొడాలి ఉమాదేవి, గోగినేని దేవయ్య 
సభలో ప్రసంగిస్తున్న ఎన్టీఆర్, ఆశీనులైన కొంగర జగ్గయ్య ,వేంకటకవి, వావిలాల, రంగారావు
కమ్యూనిస్ట్ మార్కిస్టు పార్టీ సానుభూతుడైన రంగారావుకు ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకులు సత్తెనపల్లి శాసన సభ్యునిగా పనిచేసిన పుతుంబాక వేంకటపతి గారితో అత్యంత సాన్నిహిత్యం ఉంది. ఆయన చొరవతోనే 1987 లో సత్తెనపల్లి మునిసిపాలిటీకి జరిగిన మొదటి ఎన్నికలో మునిసిపల్ చైర్మన్ గా డా. రంగారావు గారు తెలుగు దేశం బలపరిచిన మిత్రపక్ష సిపిఎం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో పరాజయం పొందారు.ఆ తరువాత 1995లో వీరి ధర్మపత్ని శ్రీమతి కొడాలి ఉమాదేవి గారు సి.పి. ఎం బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థినిగా విజయం సాధించి సత్తెనపల్లి మునిసిపాలిటీకి ప్రధమ మహిళా చైర్ పరసన్ గా పనిచేసారు. 
శ్రీమతి ఉమాదేవి గారితో డా.రంగారావు 
1995 నుండి 2000 వరకు చైర్ పర్సన్ గా పనిచేసిన ఉమాదేవిగారు అవినీతి మరక అంటకుండా ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించారు. ఈనాటి కొంతమంది ప్రజా ప్రతినిధులవలె భార్య ఎన్నికైతే భర్త పెత్తనం చలాయించేలా కాకుండా ఉమాదేవిని పూర్తి స్వతంత్రంగా పనిచేసేలా రంగారావు గారు ప్రోత్సహించేవారు. 

అన్న గోపాలకృష్ణయ్య గారి పిల్లలు
 ద్రాక్షాయణి, భువన లతో రంగారావు 
డా. రంగారావు తన ఆసుపత్రి ఎదురుగా ఉన్న పోరంబోకు స్థలం లో తన వద్ద వైద్యం పొందే పేద రోగుల సౌకర్యం  కొరకు షెడ్లు నిర్మించారు. తన ఇంటి పక్కనున్న ఆ ఖరీదైన స్థలాన్ని రెగ్యూలరైజ్ చేసుకొని పట్టా పొందే వీలు కలిగినా దాన్నిస్వచ్చందంగా మునిసిపాలిటీకి తిరిగి ఇచ్చి ఉన్నత విలువలకు నిలువెత్తు దర్పణంగా నిలిచారు. ఇప్పుడు ఆ స్థలంలో మీ సేవా కేంద్రం, సచివాలయం ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. అలాగే స్టేషన్ రోడ్ విస్తరణకు కావలిసిన స్థలాన్ని ఎటువంటి నష్టపరిహారం లేకుండా ఇవ్వటానికి అంగీకరించారు. తన తోబుట్టువుల పిల్లల ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం చేసిన ఆదర్శమూర్తి. 
ఎందరికో అనేక గుప్త దానాలు చెసిన డా. రంగారావు గారు సత్తెనపల్లి కమ్మజన సేవాసమితి వారి కాకతీయ కళ్యాణమండపంకు తన తల్లిదండ్రులు కొడాలి వెంకట్రామయ్య, లక్షీనరసమ్మల పేరుతో భూమిని దానం చేసారు. కుల మతలకు అతీతంగా అందరికి ఆ కల్యాణమండపం నేడు సేవలందిస్తుంది. 
రంగారావు,ఉమాదేవి దంపతులకు ఒక కుమారుడు ఆనంద కుమార్, సరస్వతి(కోడలు) , ఇద్దరు కుమార్తెలు కొత్తపల్లి రాధా రాణి, అనిల్ కుమార్ (అల్లుడు), కల్లూరి దేవ రాణి, నర్సింహ(అల్లుడు),ముగ్గురు మనుమరాళ్ళు మహతి, బిందు, స్వాతిరేఖ ఉన్నారు. 
తండ్రి వేంకటరామయ్య,బావ దేవయ్య అక్క ధనలక్ష్మి 
వారి కుటుంబ సభ్యులతో డా. రంగారావు 
కొడాలి మల్లిఖార్జున రావు లక్ష్మీదేవమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్ఫూర్తి దాత అయిన కొడాలి మల్లిఖార్జున రావు గారికి రంగారావు గారు స్వయానా తమ్ముడు.  

అన్న మల్లిఖార్జునరావు కుమారుడు కొడాలి శ్రీనివాస్ పిల్లలు
చరణ్ ,సుధీర కోడలు అనూష ల తో రంగారావు 
మానవత పరిమళించిన మంచి మనిషి డాక్టర్ కొడాలి రంగారావు 2004లో 45 సంవత్సరాల సుదీర్ఘ నిర్విరామ వైద్యవృత్తికి విరామం ఇచ్చి విశ్రాంతి తీసుకుంటూ తన 82వ ఏట ది. 20-06- 2020 న సత్తెనపల్లి లో తుది శ్వాస విడిచారు. వారు భౌతికంగా మన మధ్య లేకున్నా పేదల డాక్టర్ గా, మానవతావాదిగా మన మదిలో కలకాలం గుర్తిండిపోతారు.
ప్రజా వైద్యులు, ఆరోగ్య ప్రదాత డాక్టర్ కొడాలి రంగారావు గారి ఆశయ మార్గంలో పయనించటమే మనం వారికి ఇచ్చే నిజమైన నివాళి.

Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి