కర్మ యోగి మల్లిఖార్జున రావు-3

స్ఫూర్తి ప్రధాత - 3

రెండవ భాగం తరువాయి 

చదువుల ప్రేముకుడు 

విద్య వివేకాన్ని, వివేకం వికాసాన్ని ప్రసాదిస్తే ఆ విద్య సరైన విద్య. అవిద్య అజ్ఞానానికి దారి తీస్తుంది. అజ్ఞానం అనారోగ్యానికి, అనైక్యతకు బాటలు వేస్తుంది. ఇవి ప్రబిలితే సమాజపఠనం అవుతుంది. ఆనందాభివృద్ది అందించే విద్యాబోధన జరగాలంటే అంకితభావం గల మంచి బోధకులు విద్యాలయాలలో ఉండాలి . విద్యార్థిని కేంద్రంగా చేసుకొని విద్యనందించే విధానం ఉండాలి. పిల్లలకు తెలవని/రాని విషయాలు తిరిగి లాలింపుగా నేర్పించాలే కానీ వాళ్ళను కఠినంగా దండించరాదు. విద్యార్థి చదువులో వెనకబడి ఉంటె లోపం ప్రధానంగా చదువు నేర్పే ఉపాధ్యాయుడిదే. అలాగే తల్లిదండ్రులు పిల్లల చదువులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పొలంలో విత్తనాలు చల్లినంతనే పంట చేతికి రాదుకదా!ఎప్పటికప్పుడు పైరును సంరక్షించితేనే పంట దిగుబడి బాగుంటుంది. ఇదే సూత్రం చదువుకి వర్తిస్తుంది. ఆస్తిపాస్తుల కంటే చదువు చాలా విలువైనది. ఆస్తులు అమ్మిఅయినా పిల్లలను బాగా చదివించాలి. అలాగే చదువుతో పాటు సంస్కారం రెండు పిల్లలకు అబ్బాలి.  చదువుల బడి అమ్మ వడి ఒకటే అని భావించాలి. అక్కడ ఆటా పాటలకు కనీస వసతులు ఉండాలి. చదువు పేరుతో పిల్లలను దండించటం కూడదు. స్థూలంగా ఇవి మల్లిఖార్జునరావుకు విద్యపై ఉన్న కొన్ని అభిప్రాయాలు.   
వ్యవసాయం కంటే చదువుకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన ఆనాటికి వీరన్నపాలెంలో లేదు. ఉన్నత చదువులు చదివినవారు కానీ, ఉద్యాగాలు చేసేవారు కానీ గ్రామంలో వేళ్ళపై లెక్కించ వచ్చు. బడి మధ్యలో వదలి సరదాగా బండి తోలుతూ పొలానికి పోవాలన్నా పిల్లల కుతూహలాన్ని నిలువరించాలన్న నైజం ఆప్పటి తల్లితండ్రులకు లేదు.
1949 ప్రాంతంలోనే ముందుచూపుతో గోరంట్ల రామయ్య చౌదరి ( కొడాలి లక్ష్మీదేవమ్మ గారి అన్నగారు,గుంటూరు జిల్లా పరిషత్ బోర్డు సభ్యులుగా,మన్సూబ్ గా కూడా పనిచేశారు) ఇచ్చిన స్థలంలో మద్దుకూరి నారాయణరావు (Ex.MLA, పరుచూరు) గారి ఆధ్వర్యంలో 11 మంది గ్రామ పెద్దలు "శ్రీ నవ్య భారతి  ప్రైమరీ పాఠశాల" ప్రారంభించారు. ఈ సరస్వతి నిలయాన్ని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోలేక పోయారు. గ్రామంలో చదువులపై ఉన్న చిన్నచూపు నిర్లక్ష్యం పోవాలని మల్లిఖార్జునరావు తపించారు. తన ముగ్గురు పిల్లలతో పాటు అందరి పిల్లలను బాగా చదివించాలని అలుపెరగని కృషి చేసారు. పిల్లలను బడికి పంపమని పోరు పెట్టేవాడు. స్కూల్ లో ఉపాధ్యాయులు విద్యార్థులపై తగినంత శ్రద్ధ తీసుకోవటం లేదని ప్రతేకంగా ట్యూషన్ చెప్పే ఉపాధ్యాయులను ఇతర ప్రాంతాలనుండి తీసుకువచ్చి పిల్లలకు చదువు చెప్పించాడు. వారికి సగం జీతం మల్లిఖార్జునరావే ఇచ్చేవాడు. ప్రతి నెల ట్యూషన్ పీజు నెలకు 5 లేక 10 రూపాయలు చెల్లించటానికి మనసు ఒప్పని పిల్లల తల్లిదండ్రులు వల్ల వచ్చిన ఉపాధ్యాయులు మూడు నాలుగు నెలలలోనే తట్టాబుట్టా సర్దుకొని వెళ్ళిపోయేవారు. పట్టువదలకుండా మరొక పంతులు గారిని వెతికి పట్టుకొని తీసుకువచ్చేవారు. ఒక్కోసారి మిగిలిన పిల్లలు పీజులు ఇచ్చినా ఇవ్వకున్నా అనుకున్న మొత్తం జీతం మల్లిఖార్జునరావుగారే చెల్లించేవారు. ఇలా మల్లిఖార్జునరావు గారి పెద్దఅబ్బాయి రమేష్ బాబు, అమ్మాయి లతామంజరి 7వ తరగతి శ్రీ నవ్య భారతి అప్పర్ ప్రైమరీ పాఠశాలలో పూర్తి చేసేవరకు అవిశ్రాంతంగా కృషి చేశారు. ఆ తరువాత ఈ ఇద్దరినీ పరుచూరు Y.R. హైస్కూల్ లో చేర్పించారు. అప్పటికి వీరన్నపాలెం నుండి పర్చూరుకి రోడ్డు ఏర్పడలేదు. వర్షాకాలంలో చదువుకు ఆటంకం కలగరాదని కొన్నాళ్ళు పర్చూరులో ఇల్లు అద్దెకు తీసుకొని ఒక వంట మనిషిని పెట్టి మరి చదివించాడు. ఆ తరువాత తన బావమరిది బుచ్చియ్య చౌదరి ప్రధమ పుత్రుడు రాఘవేంద్రరావుతో అమ్మాయి లతామంజిరి కు పెళ్లి జరగటం, పెద్ద అబ్బాయి రమేష్ బాబు చదవు వద్దని మొండికేయటంతో ఒక మహా ప్రయత్నం విఫలమయ్యింది. అయితే ఆయన కృషి, కోరిక చిన్నబ్బాయి శ్రీనివాస్ విషయంలో విజయవంతమైంది. మనుమ సంతానం వినయ్, హిమజ, రేఖ, సాయికృష్ణ, చరణ్, సుధీర  ఆరుగురు ఉన్నత చదువులు చదవటం తో ఆయన తపస్సు ఫలించింది. మనస్సు సంతోషించింది. 
మనుమడు చరణ్ తో మల్లిఖార్జునరావు - 1989

ఆరోగ్య కార్యకర్త 


మల్లిఖార్జునరావు గారికి పిల్లలంటే ప్రేమ. వారి చదువంటే ప్రాణం. బాగా చదువుకునే వారంటే అమిత ఇష్టం. చదువుకునే పేద విద్యార్థులకు ఇతోధికంగా సహాయపడేవారు.
మనుమరాలు సుదీరతో
మల్లిఖార్జునరావు, లక్ష్మీదేవమ్మ
 -2001
అలాగే పిల్లల ఆరోగ్యం పై శ్రాద్దాశక్తులు ఎక్కువ. మల్లిఖార్జునరావు గారి తమ్ముడు రంగారావు M.B.B.S చదివి సత్తెనపల్లిలో వైద్యునిగా స్థిరపడ్డాడు. కొంతకాలం అక్కడ మందుల షాప్ పర్యవేక్షించిన అనుభవం వల్ల, మందుల వ్యాపారంలో తిరిగినందువల్ల మల్లిఖార్జునరావుకి ఆరోగ్యసంరక్షణాలపై మంచి అవగాహన ఉంది. తన పిల్లలకు వ్యాక్సిన్లు,టీకాలు దగ్గరుండి వేయించేవారు. అయితే 1967-68లో  ఊళ్ళో ఇద్దరు పిల్లలకు (మువ్వా హరిబాబు, వైశ్యుడు శ్రీశైలం గారి మనుమరాలు) పోలియో వచ్చి కాళ్ళు చచ్చుబడి పోవటం చూసి చలించి పోయారు. వెంటనే సత్తెనపల్లిలో ఉన్న తన తమ్ముడు డా. కొడాలి రంగారావు నడిపే వైద్యశాల నుండి పోలియో మందులు తెప్పించి వీధి వీధి తిరిగి ఊరిలో ఉన్న పిల్లలందరకు పోలియో చుక్కలు వేపించారు. రెండు సంవత్సరాల పాటు ఈపోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించి అందరికి పోలియోపై అవగాహన కల్పించారు. ఆతరువాత ఎప్పటికో పోలియో రహిత భారత సామాజం కొరకు ప్రభుత్వాలు పల్స్ పోలియో కార్యక్రమం ప్రతి సంవత్సరం చేపట్టటం ముదావహం. 
( మిగిలిన విషయాలు నాలుగో భాగంలో )

Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

వీరన్న పాలెం గ్రామ చరిత్ర - 2

కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి