నిత్యకృషీ వలుడు డాక్టర్ సి. వి. జి. చౌదరి

వ్యసాయం తప్పా మరో వ్యాపకం లేని కాలంలో కనుచూపు దూరంలో చదువులు చెప్పే బడులు లేని కుగ్రామంలో స్వయం కృషితో విదేశాలకు వెళ్లి అత్యున్నత విద్యను ఆర్జించిన పశు వైద్య మేధావి, పశు విద్యా కృషీ వలుడు, వీర జవాన్  లండన్ వెంకటేశ్వర్లుగా ఖ్యాతి గడించిన డాక్టర్ సి. వి. జి. చౌదరి,MRCVS నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత. కృషి ఉంటె మనుషులు మహా పురుషులు అవుతారన్న దానికి నిదర్శనం చౌదరి జీవితం. 
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం వీరన్నపాలెం (ఆనాటి పర్చూరు ఫిర్కా, బాపట్ల తాలూకా,గుంటూరు జిల్లా) గ్రామంలో గోరంట్ల వీరరాఘవయ్య, పిచ్చమ్మ దంపతులకు ప్రధమ సంతానంగా 1914లో గోరంట్ల చిన వెంకటేశ్వర్లు  చౌదరి గారు జన్మించారు. వీరికి ముగ్గురు సోదరులు రామయ్య చౌదరి, వేంకట సుబ్బయ్య చౌదరి, బుచ్చియ్య చౌదరి మరియు ఒక సోదరి కొడాలి లక్ష్మి దేవమ్మ.
MAJOR DR.C.V.G. CHOWDARY - 1914-1989 
గ్రామ మన్సుబుగా పనిచేస్తున్న 150 ఎకరాల భూస్వామి అయిన వీరరాఘవయ్య గారు స్వాతంత్ర పోరాట యోధుడు. దేశ భక్తి, లోకజ్ఞానం ఉన్న ముందుచూపు గల వ్యక్తి. అందరికి మంచి చెడులు చెప్పే గ్రామపెద్ద. చదువు చేదుగా ఉంటుంది కానీ అది అందించే ఫలాలు ఎప్పుడు తీయగానే ఉంటాయని, విద్య విజ్ఞానంతో పాటు వివేకాన్ని వికాసాన్ని ఇస్తుందని గుర్తించి చిన్న వెంకటేశ్వర్లును చదువుకోమని నిరంతరం ప్రోత్సహించారు.
వీరన్నపాలెం వీధిబడిలో ప్రాధమిక అక్షరాభ్యసం చేసుకున్న చౌదరిని హైస్కూల్ చదువు కొరకు షుమారు 25 కిలోమీటర్లు దూరంలో ఉన్న బాపట్లలో చేరారు. వసతి సౌకర్యాలు లేని ఆ రోజులలో రామయ్య పంతులు గారి ఇంటిలో చౌదరిని ఉంచి PUC వరకు చదివించారు. ఆతరువాత కాకినాడ లో పీఠాపురం రాజా వారి కళాశాలలో రసాయనిక శాస్త్రంలో B.Sc డిగ్రీ పూర్తిచేసుకొన్నారు.
వ్యవసాయమన్న, పశువులన్న మక్కువ ఉన్న చౌదరి గారు ఉద్యోగ అన్వేషణ మాని షుగర్ టెక్నాలజీ లో ఉన్నత విద్య అభ్యసించటానికి 1935 లో ఇంగ్లాండ్ వెళ్లారు. మన దేశంలో పశు వైద్యులు కొరత తీవ్రంగా ఉందని, పరిశ్రమల కంటే పశువులకు సేవ చేయటం మంచిదన్న మిత్రుల సలహా మేరకు మనసు మార్చుకొని వెటర్నరీ కోర్సులో చేరారు. 
స్కాట్లాండ్ లో ప్రపంచ ప్రసిద్ధిచెందిన ఎడింబర్గ్ విశ్వవిద్యాలయం లోని పశు వైద్య కళాశాల (The Royal (Dick) School of Veterinary Studies) లో పశు వైద్య శాస్త్రం నందు BVMS (Bachelor of Veterinary Medicine and Surgery) పట్టా పొందారు. అక్కడే పశువైద్యునిగా పేరు నమోదు చేసుకొని ఖ్యాతి గడించిన రాయల్ కాలేజీ అఫ్ వెటర్నరీ సర్జన్స్ సభ్యునిగా  MRCVS (Member of the Royal College of Veterinary Surgeons) లండన్లో 1940లో గౌరవ సభ్యత్వాన్ని పొందారు. 
ఇండియా తిరిగివచ్చిన చౌదరి హిమాలయ పర్వతశ్రేణిలో ఉన్న ముక్తేశ్వర్ లో  ఇంపీరియల్ వెటర్నరీ రీసెర్చ్ ఇనిస్ట్యూట్లో (Imperial Veterinary Research Institute) పరిశోధనా విభాగంలో శాస్త్రవేత్తగా చేరారు. 
ప్రపంచ గుత్తాధిపత్యం కొరకు రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న ఆసమయంలో దేశం కొరకు యువకులు  సైన్యంలో జేరుతున్న రోజులవి. చౌదరి కూడా చేస్తున్న  ఉద్యోగాన్ని వదిలి 1941లో ఇండియన్ ఆర్మీ వెటర్నరీ కార్ప్స్(IAVC 14th DIV) లో లెఫ్టెంట్ (substantive lieutenant) గా చేరారు. 

రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ నాయకత్వంలో గల అక్షరాజ్యాల తరువున జపాన్ దేశం  బర్మా (మైన్మార్) దేశాన్ని ఆక్రమించింది. ఆతరువాత జపాను సైనికులు ఇనుముడించిన ఉత్సాహంతో ఇండియాతో పాటు మిగిలిన దక్షిణాసియా దేశాలను కబళించటానికి సాహసించింది. ఈ తరుణంలో దేశ రక్షణ కొరకు జపాన్ సైనికులను నిలువరించటానికి బ్రిటీష్ ఇండియా తరుపున యుద్ధం చేయటానికి పశ్చమ బర్మాలోని అర్కాన్- మయుపెన్సులా యుద్ధ భూమికి మన సైనిక దళాన్ని పంపారు.

1942 నవంబర్- 1943 ఏప్రిల్ మధ్య కాలంలో బర్మా భూభాగంలో జరిగిన ఈ హోరాహోరీ యుద్ధంలో చౌదరిగారు వీరోచితంగా పాల్గొన్నారు. శత్రుసైనికుల విమాన దాడిలో పుట్టకొకరు, చెట్టుకొకరుగా చెల్లా చెదురైనా తోటి సైనికులను కూడగట్టి, ప్రాణభయంతో పారిపోయిన దళపతి బాధ్యతలను తానే స్వీకరించి వారిలో ధైర్యాన్ని నూరిపోశారు. చావు బతుకుల మధ్య అత్యంత క్లిష్ట పరిస్థితులలో శత్రుసైనికుల నుండి బాంబుదాడులు, తుపాకీ గుళ్ల వర్షం కురుస్తున్న వెనుకంజ వేయకుండా ధైర్యంగా ముందుండి నాయకత్వం వహించి తోటి సైనికులను విజయపధంలో నడిపించారు. శత్రుదాడిలో  దళ సభ్యులందరు మరణించి ఉంటారని భావిస్తున్న సమయంలో శత్రు మూకలను ఎదుర్కొని సురక్షితంగా  తిరిగివచ్చిన చౌదరికి జనం నీరాజనం పలికారు.

MEDALS AWARDED TO MAJOR CHOWDARY 
యుద్ధ రంగంలో చౌదరి చూపించిన తెగువకు, అసామాన్య ధైర్య సాహసాలకు, అకుంఠిత దీక్షకు, పోరాట పటిమకు బ్రిటిష్ ప్రభుత్వం నుండి 1943, జూన్ లో అత్యుత్తమ ప్రభుత్వరాజ్య పురస్కారాలలో మూడవదైన M.B.E.(Member of the Most Excellent Order of the British Empire) అవార్డును కింగ్ జార్జి  VI ద్వారా లండన్లో అందుకున్నారు.
MBE is the third highest ranking Order of 
the British Empire award 
1946 లో ప్రపంచ యుద్ధం సద్దుమణగిన తరువాత మేజర్ గా పదోన్నతి పొంది ఇంటికి తిరిగి వచ్చారు. అప్పటికే రెండవ ప్రపంచ యుద్ధంలో దాదాపు మన సైనికులు 87వేల మంది, మేజర్ చౌదరి పనిచేసిన  దళం లో  5 వేల మంది   వీర మరణం చెందారు. వీటితో పాటు నాజీల యుద్ధ దమనకాండలు, హిరోషిమా-నాగసాకిలో దారుణ అణు విస్ఫోటన ఆక్రందనలు దేశంలో ఊరు వాడ వ్యాపించాయి. మేజర్ చౌదరి గారి ఆనాటి యుద్ధ వీరోచిత సాహస రోమాంచిత కథనాలు బంధుమిత్రులందరికి తెలిసాయి. ఇవి విని భీతిల్లిన కుటుంబ సభ్యులు తీవ్ర వత్తిడి చేసి చౌదరి చేత మిలటరీ నుండి రాజీనామా చేయించారు.
శ్రీమతి సరోజినీ దేవితో చౌదరి 
ఆతరువాత 1947లో ఉత్తర ప్రదేశ్ లో మధుర లో కొత్తగా నెలకొల్పిన పశు వైద్య కళాశాలలో (U.P. College of Veterinary Science and Animal Husbandry) ప్రొఫెసర్ గా అధ్యాపక వృత్తిలో చేరి కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
DR.C.V.G. CHOWDARY,MRCVS 

ఆసియాలోనే వెటర్నరీ వైద్య విద్యలో డిగ్రీ ఇచ్చే తొలి కళాశాలలో  ఆదర్శ ఉపాధ్యాయునిగా అంకిత భావంతో పనిచేస్తూ ఎందరో మొదటి తరం పశువైద్యులను తీర్చిదిద్దారు. పశు వైద్యంలో  అనేక పరిశోధన పత్రాలు సమర్పించారు. ఇదే కళాశాలకు 1956 నుండి 1974 వరకు సుదీర్ఘకాలం ప్రిన్సిపాల్ గా పనిచేసి పదవీవిరమణ చేశారు. 1972లో కాలేజీ రజతోత్సవ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నుండి విశిష్ట పురస్కారం పొందారు. హిందీ ప్రాబల్యంగల ఉత్తర ప్రదేశ్ లో ఒక అచ్చ తెలుగు వాడు అలాంటి సర్వోన్నత పదవి చేపట్టి అందరి మన్ననలు పొందటం చాలా అరుదైన విషయం. ఈ వెటర్నరీకాలేజి నేడు దేశంలో అత్యుత్తమ పశు వైద్యకళాశాలగా పేరుగడించింది. ఈ కళాశాల  2001లో ఉత్తరప్రదేశ్ పశువైద్య విశ్వవిద్యాలయంగా (U.P. Pt. Deen Dayal Upadhyaya Veterinary Science University and Cattle Research Institute) రూపాంతరం చెందింది. దీని వెనుక చౌదరి గారు చేసిన అవిరాళ కృషి నిరుపమానం.
UN PEACE MEDAL
ప్రిన్సిపాల్ గా పదవీ విరమాణాంతరం చౌదరి గారు 1974 నుండి 1977 వరకు యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ (UNO) వారి FAO (Food and Agriculture Organization of the United Nations) మరియు UNDP(United Nations Development Programme) సంయుక్త పధకానికి సిరియా దేశంలో డమాస్కస్ నగరంలో ప్రాజెక్టు మేనేజర్ గా విశేష సేవలందించారు. సిరియాలో మొట్టమొదటి వెటర్నరీ కాలేజీని స్థాపించటానికి సహాయ సహకారాలు అందించారు. చమురు పై ఆధారపడిన ఒక అరబ్బు దేశం సిరియాలో ఆహార భద్రత, వ్యవసాయ అభివృద్ధి రంగాలలో చౌదరి గారు చేసిన సేవలకు గుర్తింపుగా 'యునైటెడ్ నేషన్స్ పీస్ మెడల్' ను స్వీకరించారు. 
మృదుస్వభావి, స్నేహశీలి అయిన చౌదరి తన చిన్నతనం లోనే పోలూరు గ్రామ నివాసి తన మేనత్త గడగొట్టు రాఘవమ్మ, సుబ్బయ్యగార్ల ద్వితీయ కుమార్తె ఆయిన సరోజినీ దేవి (బుల్లెమ్మ) గారినిపెద్దల మాట శిరసావహించి 1929లో వివాహమాడారు. సరోజినీ దేవి తన భర్తతోపాటు ఉత్తరాదిలో నివసించటానికి భాషాపరమైన ఇబ్బందులు రాకుండా ఉండటానికి వీరన్నపాలెంలో తన ఆడపడుచు లక్ష్మీ దేవమ్మతో కలిసి హిందీ భాషలో ప్రావీణ్యం సాధించింది. ఈ పుణ్యదంపతులకు రామచంద్రరావు, ఇందిరాదేవి, రాఘవేంద్రరావు, రాజ్యలక్ష్మి అనే నలుగురు సంతానం.
కుటుంబ సభ్యులతో డా. సి. వి. జి. చౌదరి
L - R - INDIRA DEVI, Mrs.SAROJINI DEVI, RAMACHANDRA RAO, RAJYA LAKSHMI, AND RAGHVENDRA RAO

దేశరక్షణకు పాటుపడే మిలటరీపై ఉన్న అపార ప్రేమతో, తన పెద్ద కుమార్తె ఇందిరాదేవిని మేజర్ జనరల్ ఆరెకపూడి రవీంద్రబాబు గారితో, చిన్నకుమార్తె రాజ్య లక్ష్మిని కర్నల్ కసుకుర్తి ప్రసాద్ గారితో వివాహాం చేసి పరోక్షముగా తన ఆశయాన్ని నేవేర్చుకున్న దేశభక్తుడు. పెద్ద కుమారుడు రామచంద్రరావును వ్యవసాయ విద్య M.Sc.(Ag) చదివించి జస్టీస్ గోగినేని పుల్లయ్య చౌదరి,విమలాదేవి గారి అమ్మాయి వినీతతో వివాహం చేసారు. చిన్న కుమారుడు రాఘవేంద్రరావును ఇంజనీర్ B.Tech.(Mech) గా తీర్చిదిద్ది నల్లమోతు అప్పారావు, హేమలత గార్ల కుమార్తె వాసంతితో వివాహం చేసి వారికి ఉన్నత జీవితాలను సమకూర్చారు. తన కుటుంబంతో పాటు తోడబుట్టిన వారిని కూడ ఆదరించిన ఆదర్శ దంపతులు. హైదరాబాద్ లో తమ స్వగృహంలో శేషజీవితాన్ని ప్రశాంతంగా జీవిస్తూ చౌదరిగారు తన 75వ ఏట 21-05-1989న పరమ పదించారు. ఆదర్శ గృహిణిగా చౌదరికి చేదోడువాదోడుగా నిలిచి జీవనయానం చేసిన సరోజినీచౌదరి గారు 2001లో శివైక్యం చెందారు.
భారత దేశంలో వెటర్నరీ విద్యలో విశేష కృషి చేసిన తొలి తరం మేధావిగా దేశదేశాల్లో పేరు ప్రఖ్యాతలు పొందిన డా. సి.వి. జి. చౌదరి చిరస్మరణీయుడు. జై జవాన్, జై కిసాన్ అనే నినాదానికి రెండు పార్శ్వాల న్యాయం చేసిన వ్యక్తి. నిత్య కృషీవలుడు. పట్టుదల, క్రమశిక్షణతో నీతిగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న చౌదరిగారి జీవితం భావితరాలకు స్ఫూర్తిదాయకం.

Comments

Popular posts from this blog

ధన్యజీవి కీర్తి శేషులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

మానవతావాది డాక్టర్ కొడాలి రంగారావు

కీ. శే. కొడాలి మల్లిఖార్జునరావు గారి చతుర్ధ వర్ధంతి